ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు అల్పాహారం.. తొలిరోజు నుంచే పథకం అమలు కష్టమే..!

తెలంగాణ ప్రభుత్వ బ్రేక్‌ఫాస్ట్ పథకం (Breakfast Scheme) అమలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే ఈ కార్యక్రమం కోసం సెంట్రలైజ్డ్‌ కిచెన్ మోడల్ (Central Kitchen Model) ప్రతిపాదించినప్పటికీ.. తుది ఆమోదం ప్రభుత్వం పెండింగ్‌లో ఉంది. మొదట జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాఠశాలల్లో పైలట్‌గా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana Govt School Breakfast Scheme Faces Delay, Hyderabad May Get First Rollout

Breakfast Scheme | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభానికి ఇంకా అడుగులు ముందుకు పడడం లేదు. కొత్త విద్యా సంవత్సరం ఆరంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పథకం అమలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యాశాఖ ఈ పథకానికి సంబంధించిన మెనూను ఇప్పటికే ఖరారు చేసింది. అయితే, ప్రభుత్వ స్థాయిలో ఇంకా తుది ఆమోదం లభించలేదు. ప్రతిపాదన ప్రస్తుతం సమీక్ష దశలో ఉండడంతో అమలులోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై అనిశ్చితి నెలకొన్నది.

తొలి దశలో ఎంపిక చేసిన పాఠశాలల్లోనే..

పథకాన్ని ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం సాధ్యం కాదన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రారంభ దశలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే అమలు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పథకాన్ని దశలవారీగా విస్తరించాలన్న ఆలోచనపై కూడా చర్చ జరుగుతోంది. ఈ పథకాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లోనే ప్రకటించింది. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ అనుబంధ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 20.32 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందుకోసం అల్పాహారానికి రూ.540 కోట్లు, పాల సరఫరాకు రూ.180 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నప్పటికీ పథకం ఇప్పటివరకు కార్యరూపం దాల్చకపోవడం సంబంధితశాఖలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. జూనియర్ కళాశాలలు ప్రారంభమైనా పథకం అమలులోకి రాలేదు. జూన్ 15న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో తొలి రోజే అల్పాహారం అందుతుందా అన్నదానిపై కూడా స్పష్టత లేదు.

సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా..

పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 39 సెంట్రలైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉన్నది. ఇందుకు దాదాపు రూ.299 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతిపాదిత మోడల్‌ ప్రకారం మొత్తం వ్యయంలో 70 శాతం ప్రభుత్వమే భరిస్తుండగా.. మిగిలిన 30 శాతం ఎంపికైన ఏజెన్సీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. టీజీఈడబ్ల్యూఐడీసీ (TGEWIDC) ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. బిడ్స్‌ సైతం తెరిచినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రస్తుత పరిపాలనా, మౌలిక సదుపాయాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ముందుగా గ్రేటర్ హైదరాబాద్‌లో పథకాన్ని ప్రారంభించి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుమతులు, కిచెన్ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు పూర్తి స్థాయిలో అమలు మరింత ఆలస్యం కావచ్చని అంచనా వేస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »