ఇక కుటుంబ వివరాలకు ఒకే సర్టిఫికెట్.. ఎలా పొందాలంటే?

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్'ను ఏర్పాటు చేసింది. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ వివరాలను డిజిటల్‌గా నమోదు చేసి, మీ సేవ ద్వారా రెండు రోజుల్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయనుంది.

Telangana Family Register
Telangana Family Register
  • రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ ఏర్పాటు.
  • మీ సేవ ద్వారా రెండు రోజుల్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్.
  • రేషన్ కార్డు నంబరే ఫ్యామిలీ రిజిస్టర్ ఐడీగా ఉపయోగం.

తెలంగాణలో కొత్త ఫ్యామిలీ రిజిస్టర్.. ఇక కుటుంబ వివరాలకు ఒకే డిజిటల్ రికార్డు

హైదరాబాద్: ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విధానంతో ప్రతి కుటుంబానికి ఒకే డిజిటల్ రికార్డు అందుబాటులోకి రానుంది.

జూలై 25, 2026న జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.172 ప్రకారం ఈ ఫ్యామిలీ రిజిస్టర్‌ను రెవెన్యూ శాఖ నిర్వహించనుంది. కుటుంబ సభ్యుల వివరాలను ధ్రువీకరించేందుకు పలు పత్రాలు సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ అంటే ఏమిటి?

తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ రికార్డు రూపొందించనున్నారు. ఇందులో కుటుంబానికి సంబంధించిన కీలక వివరాలన్నీ ఒకే చోట నమోదు చేయబడతాయి.

ఈ రిజిస్టర్‌కు రేషన్ కార్డు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) నంబరే ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా ఉంటుంది.

ఏయే వివరాలు నమోదు చేస్తారు?

  • ఫ్యామిలీ రిజిస్టర్‌లో ఈ వివరాలు ఉంటాయి.
  • ఫ్యామిలీ రిజిస్టర్ ఐడీ (రేషన్ కార్డు నంబర్)
  • కుటుంబ పెద్ద పేరు
  • కుటుంబ సభ్యుల పేర్లు
  • కుటుంబ పెద్దతో వారి సంబంధం
  • ప్రతి సభ్యుడి వయస్సు, పుట్టిన తేదీ
  • లింగం
  • ఆధార్ నంబర్
  • పూర్తి నివాస చిరునామా

ఈ వివరాలన్నీ ఇప్పటికే ఉన్న ఫుడ్ సెక్యూరిటీ కార్డు డేటాబేస్ నుంచి ఆటోమేటిక్‌గా తీసుకోనున్నారు.

మీ సేవ ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్

ప్రభుత్వం ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ అనే కొత్త సేవను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఈ సర్టిఫికెట్‌ను పొందేందుకు…

  • సమీప మీ సేవ కేంద్రం
  • MeeSeva ఆన్‌లైన్ పోర్టల్
  • MeeSeva మొబైల్ యాప్

ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం నిర్ణయించిన సేవా రుసుము వర్తిస్తుంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

  • కుటుంబంలోని 18 ఏళ్లు పూర్తి చేసిన సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులో తప్పనిసరిగా రేషన్ కార్డు నంబర్ ఇవ్వాలి.
  • రెండు రోజుల్లో సర్టిఫికెట్

దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత మండల తహసీల్దార్ దానిని పరిశీలిస్తారు.

ఫుడ్ సెక్యూరిటీ కార్డు డేటాబేస్‌తో వివరాలను సరిపోల్చి ఆమోదించిన తర్వాత రెండు పని దినాల్లో డిజిటల్ సంతకంతో కూడిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.

ఈ సర్టిఫికెట్‌లో…

  • ప్రత్యేక సర్టిఫికెట్ నంబర్
  • తహసీల్దార్ డిజిటల్ సంతకం

ఉంటాయి.

తహసీల్దారే ఆమోద అధికారి

  • కుటుంబం నమోదు ఉన్న మండలానికి చెందిన తహసీల్దారే ఈ సర్టిఫికెట్‌ను ఆమోదించే అధికారిగా వ్యవహరిస్తారు.
  • అలాగే, సేవలు నిర్ణీత గడువులో అందేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ సర్టిఫికెట్‌తో ఏం రాదు?

ప్రభుత్వం ఒక కీలక స్పష్టీకరణ కూడా ఇచ్చింది.

ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్…

  • ఆస్తిపై యాజమాన్య హక్కును నిర్ధారించదు.
  • చట్టబద్ధ వారసత్వానికి ఆధారం కాదు.
  • ఎలాంటి చట్టపరమైన హక్కులను కల్పించదు.
  • ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హతను స్వయంచాలకంగా ఇవ్వదు.
  • ఇది కేవలం కుటుంబ సభ్యుల ధ్రువీకరించిన వివరాలను చూపించే పరిపాలనా రికార్డు మాత్రమే అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

డిజిటల్ గవర్నెన్స్‌కు మరో అడుగు

రెవెన్యూ శాఖ, పౌర సరఫరాల శాఖ డేటాబేస్‌లను అనుసంధానం చేయడం ద్వారా ప్రజలకు వేగంగా సేవలు అందించడమే ఈ కొత్త వ్యవస్థ లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ఒకే కుటుంబ రికార్డుతో వివిధ ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

Also read: రేషన్ బియ్యంలో భారీ మార్పు.. ఇక నుంచి స్టీమ్ రైస్, కందిపప్పు కూడా!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »