హైదరాబాద్ హోటళ్లకు వెళ్తున్నారా? మీరు తింటున్నది ఈగలు వాలిన కల్తీ పేస్ట్ కావచ్చు!

హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు MS మఖ్తాలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో 4,000 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పట్టుకున్నారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేసి నగరంలోని రెస్టారెంట్లు, హోల్‌సేల్, రిటైల్ షాపులకు సరఫరా చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గడువు తీరిన FSSAI లైసెన్స్ కూడా వినియోగిస్తున్నట్లు తేలింది.

Hyderabad Adulterated Ginger Garlic Paste

హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లలో తినడానికి వెళ్లే వారికి ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్‌ఫోర్స్ ఖైరతాబాద్ జోన్ టీమ్ గురువారం MS మఖ్తా రైల్వే గేట్ సమీపంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో 4,000 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ చర్యలో నిందితుడు జసాని ఇల్యాన్ (21)ను అదుపులోకి తీసుకున్నారు.

అపరిశుభ్రత పరాకాష్ఠ

సంఘటనా స్థలంలో పోలీసులు చూసిన దృశ్యాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. తెరచిన ప్లాస్టిక్ తొట్టెల్లో పేస్ట్ నిల్వ చేయడం, దానిపై దుమ్ము, ఈగలు, ఇతర కాలుష్య కారకాలు పడటం తనిఖీలో స్పష్టంగా కనిపించింది. మానవ వినియోగానికి పూర్తిగా అనర్హమైన ఈ పేస్ట్ పెద్ద ఎత్తున నగరవ్యాప్తంగా సరఫరా అవుతోందని పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఆ ఉత్పత్తులపై ముద్రించిన FSSAI లైసెన్స్ నంబర్ 13624010000299 గడువు తీరిపోయిన పాత లైసెన్స్ అని నిర్ధారణ అయింది.

Also Read: తెలంగాణలో 13 జిల్లాలు మహిళల చేతుల్లో ఈ లిస్ట్‌లో మీ జిల్లా ఉందా?

పట్టుబడిన వస్తువులు

తనిఖీలో పట్టుబడిన మొత్తం 4,000 కేజీల పేస్ట్‌లో 40 ప్లాస్టిక్ తొట్టెల్లో లూజ్ పేస్ట్ 1,600 కేజీలు, 130 కంటైనర్లలో 5 కేజీల చొప్పున 650 కేజీలు, 900 కంటైనర్లలో కిలో చొప్పున 900 కేజీలు, 300 కంటైనర్లలో 500 గ్రాముల చొప్పున 150 కేజీలు, 3,000 కంటైనర్లలో 200 గ్రాముల చొప్పున 600 కేజీలు, 2,000 సాషెట్లలో 50 గ్రాముల చొప్పున 100 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 5 కేజీల పసుపు పొడి, 20 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 40 బ్యాగుల ఉప్పు (1,000 కేజీలు), రెండు గ్రైండింగ్ మెషీన్లు, ఒక గూడ్స్ ఆటో కూడా జప్తు చేశారు.

నగర ఆరోగ్యంపై ప్రమాదకర ముప్పు

అల్లం వెల్లుల్లి పేస్ట్ హైదరాబాద్ నగరంలో రోజువారీ వంట అవసరాలకు అన్ని హోటళ్లలో, ఇళ్లలో విరివిగా వాడే ఉత్పత్తి. నిందితుడు ఈ కల్తీ పేస్ట్‌ను నగరంలోని రెస్టారెంట్లు, హోల్‌సేల్, రిటైల్ కిరాణా షాపులకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ అక్రమంగా లాభాలు గడిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కల్తీ పేస్ట్ మానవ జీవితానికి హాని చేసే స్థాయిలో ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఎసిటిక్ యాసిడ్ వంటి హానికర రసాయనాలు పేస్ట్ తయారీలో వాడుతుండటం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తరహా కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు పలు చోట్ల నడుస్తున్నాయని గతంలో పలు సందర్భాల్లో బయటపడింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం ఇప్పుడు అత్యంత అవసరంగా కనిపిస్తోంది. నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »