- బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు
- స్పీకర్ తీర్పుపై మళ్లీ రాజకీయ సందేహాలు
- మున్సిపల్ ఎన్నికల ముందు పెరిగిన రాజకీయ వేడి
బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలను మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లుగా ప్రకటించడంతో స్పీకర్ ఇచ్చిన తాజా తీర్పుపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లుగా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు స్పీకర్ తీర్పు తర్వాత 24 గంటల్లోనే కొత్త వివాదం మున్సిపల్ ఎన్నికలు ముందు రాజకీయ వేడి పెరుగుతోంది.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపు తిరిగింది. తాజా మున్సిపల్ ఎన్నికల నియామకాలతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
Also Read - తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: పవన్ కళ్యాణ్ ప్రచారంపై బీజేపీలో సందిగ్ధం.. పొత్తు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్
ఈ అంశాన్ని ప్రతిపక్షం తీవ్రంగా విమర్శిస్తోంది. ప్రజాస్వామ్య విలువలను బలహీనపరిచేలా, చట్టపరమైన ప్రక్రియలను పక్కన పెట్టేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. రాజ్యాంగబద్ధ సంస్థలకు పరస్పర విరుద్ధ సంకేతాలు వెళ్తున్నాయన్నది వారి వాదన.
బీఆర్‌ఎస్ టికెట్‌తో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు
ఈ వివాదానికి కేంద్రబిందువైన ఎమ్మెల్యేలు అంతా భారత రాష్ట్ర సమితి టికెట్‌పై గెలిచినవారే. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. వీరిలో ఆరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్‌తో పాటు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలె యాదయ్య, సంజయ్ కుమార్ ఉన్నారు.
ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ స్పీకర్‌ను ఆశ్రయించింది. అక్కడి నుంచి స్పందన రాకపోవడంతో విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఈ నెల 6లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో స్పీకర్ విచారణ చేపట్టారు.
స్పీకర్ తీర్పు… ఆ వెంటనే కొత్త ప్రకటన
బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించారు. జాగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై ఉన్న అనర్హత ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంటూ, పార్టీ మారినట్టు స్పష్టమైన సాక్ష్యాలు లేవని తేల్చారు. ముఖ్యమంత్రి సమావేశాలు అభివృద్ధి అంశాలకే పరిమితమని ఎమ్మెల్యేల వాదనను అంగీకరిస్తూ పిటిషన్లను కొట్టివేశారు.
అయితే ఈ తీర్పు వెలువడిన 24 గంటలు గడవకముందే వివాదం మళ్లీ రాజుకుంది.
మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లుగా నియామకం
గురువారం టీపీసీసీ మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ల జాబితాను విడుదల చేసింది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు కలిపి మొత్తం 123 మందిని కోఆర్డినేటర్లుగా నియమించింది.
ఈ జాబితాలో స్పీకర్ నుంచి ‘క్లీన్ చిట్’ పొందిన ఎమ్మెల్యేలే ఉండటం రాజకీయంగా కలకలం రేపింది.
ప్రకటన ప్రకారం ఆరికెపూడి గాంధీకి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెల్లం వెంకట్రావుకు ఇల్లందు మున్సిపాలిటీ, ప్రకాశ్ గౌడ్‌కు షాద్‌నగర్ మున్సిపాలిటీ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలకు ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదం తెలిపినట్టు టీపీసీసీ వెల్లడించింది.
స్పీకర్ తీర్పుపై మళ్లీ నీడ
కాంగ్రెస్ అధికారికంగా వీరిని తమ పార్టీ కోఆర్డినేటర్లుగా ప్రకటించడంతో, “పార్టీ మారలేదన్న స్పీకర్ తీర్పు ఎలా నిలబడుతుంది?” అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ అంశం మరింత రాజకీయ వేడిని రాజేస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.