తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచిన కాంగ్రెస్ ఇప్పుడు హంగ్ ఏర్పడిన పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 16న మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్‌లలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ వ్యూహాలు మరింత వేగం అందుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ దాదాపు 66 మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్ స్థానాలను దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యను సాధించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సంఖ్యని పెంచే ఆలోచన ..
అయితే హంగ్‌గా నిలిచిన మరికొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే మొత్తం సంఖ్యను 90 దాటించాలన్న లక్ష్యంతో కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్‌ల విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శనివారం పలువురు మంత్రులు, సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన, సోమవారం జరిగే మేయర్–డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్–వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు పూర్తయ్యే వరకు హై అలర్ట్‌లో ఉండాలని సూచించారు. ఇప్పటికే దాదాపు 70 మున్సిపాలిటీల్లో గెలుపొందినట్లు పేర్కొంటూ, ఆ సంఖ్యను 90కి పైగా తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని స్పష్టం చేశారు.
Also Read: కొలంబోలో భారత్–పాకిస్థాన్ మహాసమరానికి వర్షం ముప్పు… అభిమానుల్లో ఉత్కంఠ
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హంగ్‌గా నిలిచిన మున్సిపాలిటీలలో విజయం సాధించిన స్వతంత్రులు, తిరుగుబాటు అభ్యర్థులతో చర్చలు జరపాలని సీఎం సూచించారు. పట్టణాల అభివృద్ధి దృష్ట్యా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వారిని పార్టీలోకి ఆహ్వానించాలని కూడా సూచించారు.
వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం..
అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులను ప్రభావితం చేయడానికి ప్రతిపక్ష పార్టీలు చేసే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొనాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. మొత్తంగా పరోక్ష ఎన్నికల ముందు చోటుచేసుకుంటున్న ఈ రాజకీయ కదలికలు తెలంగాణ స్థానిక సంస్థల రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చుతున్నాయి.