హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన రైతుబడి అగ్రి షో కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. భారీ ఎత్తున రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు, యువ రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వ్యవసాయం భవిష్యత్ దిశ, టెక్నాలజీ ప్రాధాన్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ఆయన విస్తృతంగా మాట్లాడారు.
దక్షిణ భారతదేశంలోనే 30 లక్షల మంది సబ్స్క్రయిబర్స్‌తో రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తున్న రైతుబడి రాజేందర్ రెడ్డి గారి సేవలను హరీష్ రావు అభినందించారు. ప్రభుత్వం చేయాల్సిన అవగాహన కార్యక్రమాలను ప్రైవేట్ స్థాయిలో నిర్వహిస్తూ రైతులకు మార్గనిర్దేశనం చేస్తున్నందుకు ప్రశంసించారు.
పట్టుపురుగుల పెంపకంలో సిద్దిపేట జిల్లా నంబర్-1 స్థానంలో ఉందని పేర్కొంటూ, ఇది వ్యవసాయ విభిన్నీకరణకు నిదర్శనమన్నారు. తీర ప్రాంతాల్లోనే సాధారణంగా పండే ఆయిల్ పామ్ పంటను తెలంగాణలో ప్రోత్సహించామని, రైతు ఆదాయం పెంచడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో 12,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.
ఒకప్పుడు కరువు ప్రాంతంగా గుర్తింపు పొందిన తెలంగాణలో సాగునీరు కాక తాగునీటికి కూడా ఇబ్బందులు ఉండేవని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, కాలువల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి విస్తరణ జరిగిందని వివరించారు. ప్రస్తుతం దేశంలోనే అధిక ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని అన్నారు.
రైతులకు టెక్నాలజీ అత్యవసరమని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం లేబర్ కొరత పెద్ద సమస్యగా మారిందని, పంజాబ్, ఝార్ఖండ్, యూపీ, బీహార్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి కార్మికులు రాకపోతే తెలంగాణ పల్లెల్లో నాట్లు పడని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. బీహార్ నుంచి హమాలీలు రాకపోతే ధాన్యం ఎత్తడం, మిల్లుల్లో దించడం కూడా కష్టమైందని చెప్పారు.
ప్రపంచ దేశాల్లో ఉన్న ఆధునిక వ్యవసాయ సాంకేతికతను తెలంగాణ రైతులకు అందించాలని సూచించారు. యంత్రాలను వినియోగించినప్పుడే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందని పేర్కొన్నారు. రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే గత రెండున్నర సంవత్సరాలుగా వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీలు లేకుండా పోయాయని విమర్శించారు.
రైతులకు భద్రత, భరోసా అవసరమని, ఆ భరోసాను గతంలో కేసీఆర్ ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు రైతాంగానికి మద్దతుగా నిలిచాయని అన్నారు. అయితే ప్రస్తుతం ఫిబ్రవరి 21 వచ్చినా రైతుబంధు నిధులు అందలేదని, సకాలంలో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వ వాణిజ్య విధానాలపై కూడా హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల సోయా, మక్కలు, పత్తి వంటి పంటలు టాక్స్ లేకుండా దిగుమతి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా పండించే సోయా రైతుల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. ఈసారి మక్కలు ఎక్కువగా పండిస్తున్న రైతుల భవిష్యత్తు ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా నుంచి తక్కువ ధరలకు దిగుమతి వస్తే దేశ రైతులు ఎలా పోటీ పడతారని ప్రశ్నించారు. సుమారు 45 లక్షల కోట్ల విలువైన మక్కజొన్న, పత్తి, సోయా దిగుమతులు జరిగితే రైతాంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.
విదేశాల నుంచి వచ్చే పామ్ క్రూడ్ ఆయిల్‌పై ఉన్న 25% టాక్స్‌ను 16%కు తగ్గించారని, దాంతో పామ్ ఆయిల్ టన్ను ధర రూ.25,000 నుంచి రూ.21,000కు పడిపోయిందని పేర్కొన్నారు. ఈ టాక్స్ తగ్గింపు వల్ల దేశ రైతులకు లాభం ఏంటో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం యాప్‌లు ప్రవేశపెట్టేటప్పుడు సాధ్యాసాధ్యాలను ఆలోచించాలని సూచించారు. పాస్‌బుక్‌కు రెండు సంచులు ఇస్తే, పాస్‌బుక్కులు లేని రైతుల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి పాస్‌బుక్కులు రాక ఎనిమిది నెలలు అవుతోందని, రైతు కోణంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
రైతాంగానికి అనుకూల విధానాలు అమలు చేసి, సకాలంలో ఆర్థిక సాయం అందించి, టెక్నాలజీ ప్రాప్తి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. రైతులకు స్థిరమైన ఆదాయం, భద్రత, భరోసా కల్పించడమే వ్యవసాయ రంగ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : PM-KISAN 2026 Guide: రైతులు ఎలా దరఖాస్తు చేయాలి? పూర్తి స్టెప్-బై-స్టెప్ వివరాలు