Indiramma Housing Scheme Telangana
-
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఖాళీ స్థలం ఉన్న పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది.
-
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, త్వరలో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
-
రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగానే ఇళ్ల మంజూరు జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఖాళీ స్థలం ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించుకోలేని పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమవగా, కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి కూడా. ఇదే సమయంలో మరో విడత ఇళ్ల కోసం అర్హులైన పేదలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండో జాబితాపై కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, త్వరలోనే మరో విడతలో అర్హులకు ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
రాజకీయాలకి అతీతంగా..
- రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
- మరో విడతలో అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.
- రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగానే ఇళ్ల మంజూరు జరుగుతుందని స్పష్టం చేశారు.
- గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అర్హులకు ఇళ్లు కట్టించాలనే ఆలోచన రాలేదని అన్నారు.
- తమ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు భద్రమైన నివాసం కల్పించడం ప్రధాన లక్ష్యమని మంత్రి చెప్పారు. ఇప్పటికే పలు గ్రామాల్లో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, పట్టణ ప్రాంతాల్లో కూడా మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
కొత్త రేషన్ కార్డులు :
- మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం అంశాలపై కూడా ప్రస్తావించిన మంత్రి
- డ్వాక్రా మహిళలకు గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రూ.23 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
- గత ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో నిర్లక్ష్యం చూపింది
- తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యంతో పేదలకు అండగా నిలుస్తోందని వివరించిన పొంగులేటి
- రూ. 500 బోనస్
రైతుల విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వరి సాగు చేస్తే నష్టమని ప్రచారం జరిగిందని, ప్రస్తుతం మాత్రం రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందజేస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమం–అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ పాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.


