ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి చెందిన భూదాన్ భూమిలో నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పోలీసులు మోహరించడంతో ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రఘునాథపాలెం మండలంలోని వి వెంకటాయపాలెం సమీపంలో సుమారు 60 ఎకరాల ప్రభుత్వ (భూదాన్) భూమి ఉంది. గత కొంతకాలంగా దాదాపు 600 మంది ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు. కొందరు గుడిసెల్లో ఉంటుండగా, మరికొందరు శాశ్వత ఇళ్లను నిర్మించుకున్నారు.
ఈ భూమిపై కొంతకాలంగా కోర్టులో వివాదం కొనసాగుతోంది. ఇటీవల కోర్టు ఆ భూమిని ప్రభుత్వాధీనంలోకి స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు.
తెల్లవారుజామున జేసీబీల దూకుడు
మంగళవారం తెల్లవారుజామునే రెవెన్యూ అధికారులు, పోలీసుల సాయంతో భారీగా జేసీబీలను తీసుకువచ్చి కూల్చివేతలు చేపట్టారు. దాదాపు వెయ్యి మంది పోలీసులు మోహరించడంతో ప్రాంతం పోలీస్ కంచెగా మారింది. ధికారుల చర్యలను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాము పదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, అకస్మాత్తుగా ఇళ్లు కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అప్పులు చేసి ఇళ్లు కట్టాం..
బాధితులు మాట్లాడుతూ, అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని, ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్లిపోవాలని చెప్పడం అన్యాయమని వాపోయారు. తమకు కనీసం ఖాళీ చేయడానికి గడువు ఇవ్వాలని, లేదా పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని స్పష్టం చేసింది. పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పక్కకు తరలించి కూల్చివేతలను కొనసాగించారు.
హైటెన్షన్ వాతావరణం
భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతుండటంతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
మొత్తానికి, భూదాన్ భూముల వివాదం మరోసారి ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసింది. బాధితులకు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు చేస్తారా? లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.


