ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య… యాక్సిడెంట్‌గా చూపించాలని కుట్ర‌పన్నిన భార్య

ఖమ్మం జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.66 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య తన భర్తను నలుగురితో కలిసి హత్య చేయించి, ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన విషయం పోలీసుల ద

Khammam Chaganti Ravi Incident

ఖమ్మం జిల్లాలో కుటుంబ బంధాలను కుదిపేసే ఘటన చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ భార్య తన భర్తను హత్య చేయించి, ఆ ఘటనను రోడ్డు ప్రమాదంలా చూపించాలని ప్రయత్నించిన విషయం బయటపడింది. పోలీసులు కేసును ఛేదించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నగరానికి చెందిన చాగంటి రవి (52), ప్రశాంతి దంపతుల‌లో రవి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా మద్యం అలవాటు కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితిని అవకాశంగా భావించిన భార్య ప్రశాంతి అతని పేరుమీద భారీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే పథకం వేసింది.

గత ఏడాది జూలైలో తన బంధువు శ్రీనివాస్ సహాయంతో రవి పేరుమీద రూ.66 లక్షల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది. భర్త ఆరోగ్యం బాగాలేదని, త్వరలోనే చనిపోతాడని భావించి ఈ పథకం వేసినట్లు తెలుస్తోంది. అయితే రవి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటంతో ప్రశాంతి ప్లాన్ బెడిసి కొట్టింది.

Also Read: వెలుగుమట్ల బాధితుల పక్షాన కవిత ఆందోళన.. రోడెక్క‌డంతో ఖ‌మ్మంలో తీవ్ర ఉద్రిక్త‌త‌..

భ‌ర్త‌ని చంపేందుకు ప్లాన్..

భర్త త్వరగా చనిపోడని గ్రహించిన ప్రశాంతి ఇన్సూరెన్స్ డబ్బులు పొందేందుకు అతడిని హత్య చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో శ్రీనివాస్‌తో పాటు జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబులను సంప్రదించి భర్తను హత్య చేస్తే ఇన్సూరెన్స్ డబ్బుల్లో సగం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది.

పథకం ప్రకారం మార్చి 2న రవిని ఫోన్ చేసి బయటకు తీసుకెళ్లారు. అతనికి మద్యం తాగించి మత్తులోకి నెట్టారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం గ్రామం సమీపంలో అతడిని రోడ్డుపై దించారు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం వెంకటేశ్‌కు చెందిన కారును జోగి రాజ్‌కుమార్ వేగంగా నడుపుతూ వచ్చి రవిని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితులు కారును అక్కడి నుంచి తీసుకెళ్లి ఒక స్నేహితుడి ఇంటి వద్ద దాచిపెట్టి, ఘటనను రోడ్డు ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేశారు.

కుటుంబ స‌భ్యుల‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం..

ఇదిలా ఉండగా భర్త మృతిపై ప్రశాంతి ఏమీ తెలియనట్లు నటించింది. రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయాడంటూ ఏడుస్తూ కుటుంబ సభ్యులను, స్థానికులను నమ్మించే ప్రయత్నం చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రమాదంపై ఫిర్యాదు కూడా చేసింది.

అయితే పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీలో కనిపించిన దృశ్యాలు, ప్రశాంతి చెప్పిన వివరాలు సరిపోకపోవడంతో ఆమెపై అనుమానం వ్యక్తమైంది. అనంతరం పోలీసులు ప్రశాంతిని విచారించగా నిజం బయటపడింది. విచారణలో భర్తను హత్య చేయించినట్లు ప్రశాంతి అంగీకరించింది. ఈ హత్యలో మరో నలుగురు సహకరించినట్లు కూడా వెల్లడించింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.

  • ఇన్సూరెన్స్ పాలసీ విలువ: రూ.66 లక్షలు
  • హత్యకు సహకరించిన వారు: నలుగురు
  • ఘటన స్థలం: ఖమ్మం రూరల్ మండలం
  • పోలీసులు స్వాధీనం చేసుకున్నవి: కారు, ఆటో, మొబైల్ ఫోన్లు

నిందితుల వద్ద నుంచి ఒక కారు, ఆటో, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఐదుగురినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించగా, వారిని జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యే భర్తను హత్య చేయించడం సమాజంలో పెరుగుతున్న క్రైమ్‌లపై మరోసారి చర్చకు దారితీసింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »