హైదరాబాద్: తెలంగాణలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు వారబంది కారణంగా పది రోజులుగా సాగర్ నీరు నిలిచిపోవడంతో పంట ఎండిపోతోంది. మరోవైపు నెల రోజులు గడిచినా మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. ఖమ్మం, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో రాస్తారోకో, ధర్నాలు జరుగుతున్నాయి.
ఏ జిల్లాల్లో రైతుల నిరసనలు జరుగుతున్నాయి?
ఖమ్మం జిల్లా – సాగర్ నీరు రాక పంట ఎండుతోంది
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రైతులు ఏన్కూరు-పల్లిపాడు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారబంది కారణంగా పది రోజులుగా సాగర్ నీరు నిలిచిపోవడంతో మొక్కజొన్న పంట ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్నారు.
బోనకల్ మండలం – కొనుగోలు కేంద్రం కోసం ధర్నా
బోనకల్ మండలం ముష్టికుంట్లలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మొక్కజొన్న కంకులతో నిరసన నిర్వహించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం-బోనకల్లు ప్రధాన రహదారిపై బైఠాయింపు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జగిత్యాల కలెక్టరేట్ – మాజీ మంత్రి జీవన్ రెడ్డి నేతృత్వంలో నిరసన
జగిత్యాల కలెక్టరేట్ ముందు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతుల ఆందోళన జరిగింది. రైతులు కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మార్క్‌ఫెడ్‌పై మండిపడ్డారు
కోరుట్ల నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో జాప్యంపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మార్క్‌ఫెడ్ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. రైతులు నెల రోజుల నుండి ఇబ్బందులు పడుతుంటే అధికారులు నాలుగు రోజుల తర్వాత తెరుస్తామని సమాధానం చెప్పడం అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు తానే వెళ్ళి మొక్కజొన్న కేంద్రాలు ప్రారంభిస్తానని హెచ్చరించారు.
Also Read:


