పెట్రోల్, డీజిల్ Diesel కొరతపై ప్రజల్లో ఆందోళన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టంగా చెబుతోంది. ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలోనూ దేశంలో ఇంధనానికి ఎలాంటి కొరత లేదని, తగినన్ని నిల్వలు ఉన్నాయని అధికారులు పదేపదే చెబుతున్నారు. పుకార్లను నమ్మవద్దని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే గ్రౌండ్ రియాల్టీ మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. శనివారం కొంత మేరకు కనిపించిన ఈ సమస్య, ఆదివారం నాటికి మరింత పెరిగినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతుండగా, కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పోలీసు భద్రత మధ్య ఇంధన విక్రయాలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
భిన్న స్పందనలు..
ఈ పరిస్థితిపై బంకుల యజమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆయిల్ కంపెనీల నుంచి ఇంధనం సకాలంలో సరఫరా కావడం లేదని వారు చెబుతున్నారు. ముందస్తుగా చెల్లింపులు చేసినా ట్యాంకర్లు రెండు మూడు రోజుల ఆలస్యంగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. గతంలో సాయంత్రం స్టాక్ అందిన తర్వాత చెల్లింపులకు అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు ముందే డబ్బులు చెల్లించినా సరఫరాలో జాప్యం జరుగుతోందని అంటున్నారు.
మరోవైపు రాజకీయ, ఆర్థిక అంశాలు కూడా ఈ సమస్యకు కారణమయ్యే అవకాశముందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇంధన ధరలను పెంచకుండా ఉంచారని, ఎన్నికలు పూర్తైన తర్వాత ధరల పెంపు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు నష్టాలను తగ్గించుకునేందుకు సరఫరా తగ్గించి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలు కూడా కంపెనీలపై భారం పెంచుతున్నాయి. ఆసియా దేశాల్లో ఇప్పటికే ఇంధన ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సరఫరా తగ్గించడం ద్వారా నష్టాలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో దాదాపు 25 శాతం బంకులు స్టాక్ లేక మూతపడినట్లు సమాచారం.
హైదరాబాద్‌లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సమస్య కనిపిస్తోంది. ఏపీలోనూ పరిస్థితి దాదాపు ఇలాగే ఉందని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, ప్రభుత్వం చెబుతున్నదానికంటే భిన్నంగా ఫీల్డ్ పరిస్థితులు ఉండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్యానిక్ బయ్యింగ్ మొదలై పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:


