తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్ర‌తాపం.. నిజామాబాద్‌లో అత్య‌ధికంగా 45.7 డిగ్రీలు..

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States Weather) తీవ్రమైన ఎండలు (Severe Heatwave) ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తెలంగాణలో (Telangana Heatwave) 45°C పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) వడగాలులు (Heatwaves) తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Heat
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్ర‌తాపం.. నిజామాబాద్‌లో అత్య‌ధికంగా 45.7 డిగ్రీలు..

Temperatures | తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ఉద‌యం నుంచే భానుడు ప్ర‌తాపం చూపిస్తున్నాడు. ఫ‌లితంగా ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు జ‌నం జంకుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఎండ‌లు విప‌రీతంగా ఉన్నాయి. దీనికి తోడు ఉక్క‌పోత‌, వ‌డ‌గాలులు వీస్తుండ‌డం మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. ప‌లు చోట్ల రికార్డు స్థాయిలో ఎండ‌లు 45 డిగ్రీలు దాటాయి. మధ్యాహ్నం వేళ బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇళ్లలో కూడా వేడి తగ్గకపోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్రంగా ఇబ్బందిప‌డుతున్నారు. ఏసీలు, ఫ్యాన్లు ఉన్నా వేడి ప్ర‌భావం త‌గ్గ‌డం లేద‌ని వాపోతున్నారు.

Read Also : తెలంగాణ SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్ 2026 విడుదల – జూన్ 5 నుంచి జూన్ 12 వరకు

అత్య‌ధికంగా నిజామాబాద్‌లో..

తెలంగాణ‌లో భానుడి ప్ర‌తాపం చూపించాడు. ఆదివారం ఉత్త‌ర తెలంగాణ జిల్లాలో భారీ ఉష్ణోగ‌త్ర‌లు రికార్డ‌య్యాయి. అత్య‌ధికంగా నిజామాబాద్ జిల్లా భీమ్‌గ‌ల్‌లో 45.7 డిగ్రీల గ‌రిష్ట ఉష్ణోగ‌త్ర‌లు న‌మోదైన‌ట్లుగా వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. అలాగే, నిర్మ‌ల్ జిల్లా ద‌స్తురాబాద్‌లో 45.3, కామారెడ్డి జిల్లా కొల్లూరులో 45.2 డిగ్రీల ఉష్ణోగ‌త్ర‌లు రికార్డ‌య్యాయ‌ని తెలిపింది. అలాగే, ఆదిలాబాద్‌, జ‌గిత్యాల‌, మంచిర్యాల‌, ఆసిఫాబాద్‌, రాజ‌న్న సిరిసిల్ల‌, పెద్ద‌ప‌ల్లి, 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ‌త్ర‌లు రికార్డ‌య్యాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇవాళ సైతం భారీ ఉష్ణోగ‌త్ర‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు హెచ్చ‌రించారు. సాధార‌ణం కంటే ఎక్కువ‌గా ఉష్ణోగ‌త్ర‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు.

Read Also : 2700 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ… జిల్లాలో కీలక సమీక్షలు

ఏపీలో వ‌డ‌గాలులు..

ఏపీ వడగాలుల ప్రభావంతో ఇప్పటివరకు ఎన్టీఆర్‌, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆయన హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. కంభంలో 43.3 డిగ్రీలు నమోదు కాగా, ఆళ్లగడ్డలో 42.8 డిగ్రీలు, గూడూరులో 42.2 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని తొర్రగుడిపాడులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అనంతపురం, కర్నూలు, కృష్ణా, పల్నాడు, ఏలూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కూడా 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.

Read Also : 12 రోజుల పుష్కరాలు… మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరం

ప‌లుచోట్ల వ‌ర్షాలు కురిసే ఛాన్స్‌..

ఏపీలోని 28 జిల్లాల్లో 14 జిల్లాల పరిధిలోని 65 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు అధికారులు తెలిపారు. సోమవారం పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా విజయనగరం, మన్యం, తూర్పుగోదావరి, పల్నాడు, నంద్యాల, కడప వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44.5 డిగ్రీల వరకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. మన్యం జిల్లా సీతంపేట మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కూడా రాష్ట్రంపై పడే అవకాశం ఉన్న‌ది వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. ప‌లు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయ‌ని పేర్కొంది. అల్లూరి, పోలవరం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ వివ‌రించింది.

Read Also : ఫార్మర్స్ వీక్, రైతుల రిజిస్ట్రేషన్ ఆదేశాలు

అధికారుల వార్నింగ్‌..

ఉరుములు, మెరుపుల‌తో వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్న నేప‌థ్యంలో పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్ల‌కూడ‌ద‌ని అధికారులు స్పష్టంగా హెచ్చరించారు. పిడుగుల సమయంలో సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించారు. ఇక రోజువారీ జీవితం కూడా ఎండ ప్రభావంతో మారిపోయింది. మధ్యాహ్నం వేళ బయట తిరగాలంటే ప్రజలు టోపీలు, మాస్కులు, తడి గుడ్డలు వాడుతున్నారు. ఉద్యోగులు, కూలీలు మాత్రం తప్పనిసరిగా ఎండలోనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. చలివేంద్రాలు, కొబ్బరి బోండాలు, శీతల పానీయాల వద్ద రద్దీ పెరుగుతోంది. ఈ వేసవిలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం అవుతుంద‌ని, వేడి పదార్థాల కంటే సహజ పండ్ల రసాలు, తేలికపాటి ద్రవాహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి శరీరానికి తగిన శక్తిని ఇచ్చి అలసటను తగ్గిస్తాయని చెబుతున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »