మృత్యువుతో పోరాడి ఓడిన మ‌హిళా కానిస్టేబుల్.. సౌమ్య కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలన్న‌ కవిత

నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడంతో కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని డిమాండ్.

Excise constable Soumya death incident in Nizamabad Telangana
  • మృత్యువుతో పోరాడి ఓడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య
  • కుటుంబం, సిబ్బందిపై తీవ్ర దిగ్భ్రాంతి
  • ప్రాణత్యాగ ఘటనపై ప్రభుత్వ దృష్టి సారించాలని డిమాండ్

తెలంగాణలోని నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని కలిగించింది. దాదాపు 9 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

గత నెల 23న నిజామాబాద్ నగర శివారులో గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సైతో పాటు కానిస్టేబుల్ సౌమ్య కూడా విధుల్లో పాల్గొన్నారు. స్మగ్లర్ల వాహనాన్ని ఆపేందుకు యత్నించగా వారు నిర్లక్ష్యంగా సిబ్బందిపైకి కారును దూసుకెళ్లడంతో సౌమ్య తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆల్‌టైమ్ గరిష్టాల నుంచి కిందకు జారిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఊరట

ఎనిమిది రోజుల పాటు అపస్మార‌క స్థితిలో..

  • హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సమయంలో విష‌మించిన‌ సౌమ్య ఆరోగ్య పరిస్థితి
  • ఆమెకు రెండు వైపులా పక్కటెముకలు విరగడం, మల్టీ ఆర్గన్స్ దెబ్బతినడం వంటి తీవ్ర గాయాలు అయ్యాయి.
  • కిడ్నీ తీవ్రంగా దెబ్బతినడంతో తొలగించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.
  • ఎనిమిది రోజులపాటు అపస్మారక స్థితిలోనే ఉన్న ఆమె చివరికి మృత్యువుకు లొంగిపోయింది.

సౌమ్యకు పోలీస్ ఉద్యోగం అంటే ఎంతో అభిరుచి ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించి, కేవలం 20 నెలల క్రితమే విధుల్లో చేరింది. గంజాయి మాఫియాను అరికట్టే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని కలచివేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

త‌క్ష‌ణ‌మే ఆదుకోవాల‌న్న క‌విత‌

  • ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి
  • సౌమ్య మృతి త‌న‌ని తీవ్రంగా కలచివేసిందన్నారు.
  • సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన క‌విత‌
  • ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన క‌విత‌
  • విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కవిత డిమాండ్

ఈ ఘటన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సిబ్బందిపై మరోసారి దృష్టి సారించేలా చేసింది. సౌమ్య మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »