వాయు కాలుష్య నియంత్రణకు తెలంగాణ కీలక నిర్ణయం.. ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు, రూ.200 కోట్లతో ప్రత్యేక పాలసీ

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 1.26 లక్షల ఆటోలను దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రత్యేక పాలసీ రూపొందిస్తోంది.

Telangana electric auto policy

వాయు కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు హరిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో నడుస్తున్న ఆటోరిక్షాలకు ఎలక్ట్రిక్ కిట్లు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ నిర్ణయం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న సుమారు 1.26 లక్షల ఆటోలను దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో నడుస్తున్న ఆటోరిక్షాలకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కిట్లు అమర్చే విధంగా రవాణా శాఖ చర్యలు చేపడుతోంది.

ఉన్నత స్థాయి సమావేశంలో

ఈ ప్రణాళికను అమలు చేయడానికి రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మరియు తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పాలసీ రూపొందించనున్నారు. ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు అమర్చే రెట్రోఫిట్‌మెంట్ పాలసీని ఖరారు చేయడానికి మార్చి 16న సెక్రటేరియట్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

Also Read: ఎంజీఆర్ వ్యాఖ్యల వివాదం… రాజేంద్ర ప్రసాద్‌కు విశాల్ ప్రశంసలు

ఈ పథకంలో భాగంగా ఆటో యజమానులకు పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు అవసరమైన ఖర్చును 100 శాతం వరకు ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇందుకోసం 2026–27 బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సబ్సీడీ రూపంలో నిధులు

అలాగే ఆటో డ్రైవర్లపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు సంక్షేమ శాఖల సబ్‌ప్లాన్‌ల నుంచి సబ్సిడీ రూపంలో నిధులను అందించనుంది. ఒక ఆటోను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చేందుకు దాదాపు రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ORR పరిధిలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను మాత్రమే నడిపించేలా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ఈ చర్యల ద్వారా హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »