మార్చి మొదటి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే మండుతున్న ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయే ఘటనలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 వేల పరిహారం అందించేది. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పరిహారాన్ని భారీగా పెంచింది. ఇకపై వడదెబ్బ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందించనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
త్రిసభ్య కమిటీ ఏర్పాటు..
అయితే ఈ పరిహారం పొందేందుకు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వడదెబ్బ కారణంగా మరణం సంభవించిందని నిర్ధారించేందుకు తెలంగాణ మండల స్థాయిలో ప్రత్యేక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇందులో వైద్యశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఉంటారు. ఈ కమిటీ విచారణ జరిపి వడదెబ్బ కారణంగా మరణం జరిగినట్లు ధృవీకరించిన తర్వాతే పరిహారం మంజూరు అవుతుంది.
Also Read: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ.. 50 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగిస్తున్నారా?
ఎవరైనా వ్యక్తి వడదెబ్బకు గురై మృతిచెందినట్లు అనుమానం ఉంటే తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి. అలాగే మరణ ధ్రువీకరణ పత్రం, పంచనామా నివేదిక వంటి ఆధార పత్రాలను సమర్పించిన తర్వాత మాత్రమే కుటుంబ సభ్యులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఇక ఎండాకాలంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తెలుపు లేదా లైట్ కలర్ దుస్తులు ధరించడం మంచిదని చెబుతున్నారు.
అదేవిధంగా వేసవిలో ఎక్కువగా నీరు మరియు ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శీతలపానియాలు, మత్తు పానీయాలు తీసుకోవడం తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ, గుడ్డ లేదా గొడుగు వంటివి ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.