తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ.. 50 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగిస్తున్నారా?

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ తెలంగాణలో ఏప్రిల్, మే నెలల్లో చేపట్టనున్నారు. ఈ ప్రక్రియలో డూప్లికేట్ ఓట్లను గుర్తించి సుమారు 50 లక్షల వరకు ఓట్లు తొలగించే అవకాశం ఉందని అధి

Telangana Chief Electoral Officer Sudarshan Reddy

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను సరిచేయడానికి ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియ తెలంగాణలో కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఏప్రిల్, మే నెలల్లో ఈ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో డూప్లికేట్ ఓట్లు తొలగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 3.35 కోట్లుగా ఉంది. అయితే ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఈ సంఖ్య 2.75 నుంచి 2.80 కోట్ల మధ్యకు తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. గడిచిన పదిహేనేళ్లలో చాలా మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకుని కొనసాగిస్తున్నారని, ఇప్పుడు అలాంటి డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

హైదరాబాద్‌లోనే ఎక్కువ తొలగింపులు

పట్టణీకరణ, ఉపాధి అవకాశాల కారణంగా గత కొన్నేళ్లుగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది హైదరాబాద్‌కు వలస వచ్చి స్థిరపడుతున్నారు. అయితే వారు కొత్తగా నగరంలో ఓటు నమోదు చేసుకున్నప్పటికీ తమ స్వగ్రామాల్లో కూడా ఓటును కొనసాగిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతుండటంతో కొందరు రెండు చోట్లా ఓటు వినియోగించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.

Also Read: టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా బిజీ షెడ్యూల్.. ఏ దేశాలతో ఎప్పుడు మ్యాచ్‌లు అంటే..?

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి ప్రస్తుతం సుమారు 87 లక్షల ఓట్లు ఉన్నాయి. అందులో డూప్లికేట్ ఓట్లు సుమారు 20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవారితో పాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చినవారూ ఉన్నారు.

గ్రామీణ తెలంగాణలో కూడా భారీ తగ్గింపు

తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లో కూడా వలసలు పెరిగాయి. దీంతో ఈ పట్టణాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. అయితే గ్రామాల్లో ఉండాల్సిన ఓటర్ల సంఖ్య తగ్గాల్సి ఉన్నా చాలా మంది తమ స్వగ్రామాల్లో కూడా ఓటు కొనసాగిస్తున్నారు.

ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ద్వారా గ్రామీణ తెలంగాణలో కూడా సుమారు మరో 30 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొందరు తమ ఓటును నగరంలో కొనసాగించేందుకు మొగ్గు చూపుతుండగా, మరికొందరు స్వగ్రామాల్లోనే కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో డూప్లికేట్ గుర్తింపు

ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు, ఎన్యూమరేటర్లు కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తారు. సర్వే సమయంలో ఓటరు స్వయంగా అక్కడే ఉంటూ తన ఓటు కొనసాగించాల్సిన చోటును స్పష్టంగా తెలియజేయవచ్చు. లేకపోతే ఆ ఇంటి యజమాని లేదా కుటుంబ సభ్యులు తగిన పత్రాలు సమర్పించి ఫారంపై సంతకం చేయవచ్చు.

ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయా లేదా అన్నది గుర్తించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించనుంది. ఇందులో పేరు, తండ్రి పేరు, వయసు, చిరునామా వంటి వివరాల్లో ఉన్న సారూప్యతను పరిశీలించి అనుమానాస్పద ఎంట్రీలను గుర్తిస్తారు. అనంతరం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరతారు. సరైన ఆధారాలు సమర్పించకపోతే ఆ ఓటును తొలగిస్తారు.

నాలుగు దశల్లో సవరణ ప్రక్రియ

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తారు. రెండవ దశలో సేకరించిన వివరాల ఆధారంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. మూడవ దశలో ఆ జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే వాటిపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించి సవరణలు చేస్తారు. చివరగా నాలుగవ దశలో తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియపై రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీహార్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో, అలాగే త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియపై ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను వలసల పేరిట తొలగిస్తున్నారనే విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి.

తెలంగాణలో ఈ ప్రక్రియ ఎలా అమలు అవుతుందో, ఎలాంటి పారదర్శకతతో నిర్వహిస్తారో ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే స్పష్టత రానుంది. ఎన్నికల సంఘం మాత్రం డూప్లికేట్ ఓట్లను పూర్తిగా తొలగించి పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యమని చెబుతోంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »