తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. మొత్తం 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ బదిలీలు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరిపాలనను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా నడిపించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ బదిలీల్లో ముఖ్యంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నియామకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సీనియర్ ఐఏఎస్‌లకి అదనపు శాఖల బాధ్యతలు..
ఇప్పటివరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను సింగరేణి సీఎండీగా నియమించారు. ఇంతకాలం ఇన్‌చార్జ్ సీఎండీగా వ్యవహరించిన కృష్ణ భాస్కర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అదేవిధంగా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అదనపు శాఖల బాధ్యతలు కూడా అప్పగించారు. సబ్యసాచి ఘోష్‌కు గిరిజన సంక్షేమ శాఖతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా కల్పించారు. సందీప్ కుమార్ సుల్తానియాను ప్రణాళిక శాఖతో పాటు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (TGRAC) డైరెక్టర్ జనరల్‌గా నియమించారు.
దివ్య దేవరాజన్‌కి అదనపు బాధ్యతలు..
దివ్య దేవరాజన్‌కు పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించగా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’కి కాత్యాయని దేవిని నోడల్ అధికారిగా నియమించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ్ శర్మ, జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మయాంక్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ బదిలీల ద్వారా పరిపాలనా వ్యవస్థలో వేగం పెంచడం, శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మున్సిపల్ ఎన్నికల సమయం కావడంతో ఈ మార్పులు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.