బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హైదరాబాద్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అధఃపాతాళానికి తీసుకుపోయారని మండిపడ్డారు. పారిశుధ్యం నుంచి ప్రజా రవాణా వరకు, పారిశ్రామిక ప్రగతి నుంచి వ్యాపార వాణిజ్యాల వరకు అన్ని రంగాల్లో నగరం క్షీణించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రియల్ ఎస్టేట్ స్కామ్‌లపై సంచలన ఆరోపణలు
రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి హైడ్రా నుంచి మొదలుకొని పారిశ్రామిక భూముల స్కామ్, టీడీఆర్ పేరిట మరో స్కామ్, ఫోర్త్ సిటీ భూముల కుంభకోణం జరిగాయని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 24 నెలలుగా రేవంత్ రెడ్డి చేసింది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా తన ఆర్థిక ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసమే పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు.
ఫ్యూచర్ సిటీ వివాదం కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
ఉన్న హైదరాబాద్ నగరాన్ని వదిలిపెట్టి తన రియల్ ఎస్టేట్ కోసం ఫోర్త్ సిటీని, ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి ప్రమోట్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు ఎక్కడ వెళ్లినా హైదరాబాద్ గురించి మాట్లాడకుండా కేవలం ఫ్యూచర్ సిటీ గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. నగరంలో దోమల నివారణ కూడా చేయలేనంత పరిపాలనా వైఫల్యం నెలకొందని, 10 సంవత్సరాల క్రితం ఎప్పుడూ లేని కరెంట్ కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుధ్య సమస్యలు తిరిగి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కాలంలో హైదరాబాద్ అభివృద్ధి గుర్తుచేశారు
10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మెట్రో నగరంగా తీర్చిదిద్దిందని కేటీఆర్ గుర్తుచేశారు. కరెంట్ కోతలు లేకుండా, తాగునీరు, పారిశుధ్యం, ప్రజా రవాణా అన్ని రంగాల్లో నగరాన్ని ముందుకు తీసుకుపోయారని పేర్కొన్నారు. అందుకే ప్రజలు రెండుసార్లు హైదరాబాద్‌లో మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్‌కు కట్టబెట్టారని గుర్తుచేశారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.


