తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠకు తెరలేపింది. గెలుపు-ఓటముల మధ్య అంతరం కేవలం ఒక్క ఓటు కావడంతో అభ్యర్థుల గుండెల్లో ఉత్కంఠ నెలకొంది. పలు కౌంటింగ్ కేంద్రాల్లో రీకౌంటింగ్ నిర్వహించిన తర్వాతే తుది ఫలితాలను ప్రకటించాల్సి వచ్చింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల మధ్య జరిగిన హోరాహోరీ పోరు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఒక్క ఓటుతో గెలుపు తీరానికి…
మున్సిపాలిటీల్లో విజయం కోసం అభ్యర్థులు చేసిన పోరాటం చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా ఐదు ప్రాంతాల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో ఫలితాలు తేలడం ప్రతి ఓటు విలువను మరోసారి నిరూపించింది. ఓటమి అంచున నిలిచిన అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం పట్టుబట్టడంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు అధికారిక ఫలితాలు వెలువడటంతో గెలిచిన వారు సంబరాల్లో మునిగితేలగా, ఓడిన వారు నిరాశతో వెనుదిరిగారు.
కీలక వార్డుల ఫలితాలు
మిర్యాలగూడ (18వ వార్డు): మొత్తం 1,711 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులకు 837 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు 836 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ తర్వాత కూడా ఫలితం మారకపోవడంతో సైదులు ఒక్క ఓటుతో గెలుపొందారు.
పరకాల (17వ వార్డు): పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రజనికి 368 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సుభద్రకు 366 ఓట్లు వచ్చాయి. అయితే 3 పోస్టల్ ఓట్లు సుభద్రకు పడటంతో ఆమె ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు.
గద్వాల (8వ వార్డు): కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ 465 ఓట్లు సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మకు 464 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో వెంకటమ్మ విజేతగా నిలిచారు.
కొల్లాపూర్ (2వ వార్డు): కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మి, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మపై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.
కల్వకుర్తి (10వ వార్డు): కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్, గులాబి పార్టీ అభ్యర్థి తాహెర్‌పై ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు.
రామగుండంలో డ్రా… రీకౌంటింగ్‌తో విజయం
రామగుండం 59వ డివిజన్‌లో ఫలితం మరింత ఆసక్తికరంగా మారింది. మొదట కాంగ్రెస్ అభ్యర్థి ఖాజాసనా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి బాలసాని తిరుపతికి సమాన ఓట్లు రావడంతో అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. గతంలో చెల్లని ఓట్లుగా పక్కన పెట్టిన నాలుగు ఓట్లను తిరిగి పరిశీలించగా, అందులో రెండు ఓట్లు తిరుపతికి అనుకూలంగా చెల్లుబాటయ్యాయి. దీంతో ఏఐఎఫ్‌బీ అభ్యర్థి రెండు ఓట్ల తేడాతో విజేతగా నిలిచారు. మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రతి ఓటు ఎంత కీలకమో మరోసారి స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు ఇది గట్టి సందేశం కాగా, ఓటర్లకు తమ ఓటు ప్రభావం ఎంత ఉందో తెలియజేసిన సంఘటనగా నిలిచింది.