తెలంగాణలో దాదాపు రెండేళ్ల ఆలస్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబడిన విషయం తెలిసిందే. జనవరి నెలలో ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్రంలోని గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పడి, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఎన్నికల ఆలస్యం కారణంగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను నిలిపివేసింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
ఇటీవల ఎన్నికలు పూర్తయి కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దశలవారీగా నిధులను విడుదల చేయడం ప్రారంభించింది. పలు విడతల్లో తెలంగాణ గ్రామ పంచాయతీలకు సుమారు రూ.1,034 కోట్ల వరకు నిధులు విడుదలైనట్లు సమాచారం. అయితే ఈ నిధుల విషయంలో ఇప్పుడు పాత సర్పంచ్‌లు, కొత్త సర్పంచ్‌ల మధ్య తీవ్రమైన వివాదం చెలరేగింది.
పాత సర్పంచ్‌ల ఆవేదన…
పాత సర్పంచ్‌లు తమ పదవీకాలంలో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెబుతున్నారు. వైకుంఠధామాలు, డ్రైనేజీలు, క్రీడా ప్రాంగణాలు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల పనులు పూర్తి చేసినప్పటికీ అప్పట్లో బిల్లులు రాలేదని వారు వాపోతున్నారు. ఈ పనుల కోసం అప్పులు తీసుకుని పనులు పూర్తి చేశామని, ఇప్పుడు వడ్డీలు పెరిగిపోతున్నాయని పాత సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.1000 కోట్లకు పైగా బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన నిధులపై తమకే హక్కు ఉందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు.
అయితే కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు. తాము ఎన్నికల సమయంలో గ్రామాల అభివృద్ధికి ఎన్నో హామీలు ఇచ్చామని, ఇప్పుడు వచ్చిన నిధులన్నీ పాత బకాయిల చెల్లింపులకు మాత్రమే వినియోగిస్తే కొత్త పనులు ఎలా చేపడతామని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూడా నిధులు అవసరమని వారు అంటున్నారు.
పెండింగ్ నిధులని త్వరగా విడుదల చేయాలి..
కొత్త సర్పంచ్‌ల ప్రకారం ప్రస్తుతం అందుతున్న నిధుల్లో చాలా భాగం పాత బకాయిల చెల్లింపులకే వెళ్తోంది. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, స్ట్రీట్ లైట్లు వంటి అత్యవసర అవసరాలకు కూడా నిధులు లేకుండా పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నుంచి ఇంకా పెండింగ్‌లో ఉన్న నిధులను కూడా త్వరగా విడుదల చేయాలని తెలంగాణ గ్రామ సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఈ వివాదంపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. గతంలో గ్రామాల్లో చేపట్టిన తాగునీరు, పారిశుద్ధ్య పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తాజాగా విడుదలైన నిధుల నుంచే చెల్లించాలని ఆమె సూచించారు. అదే సమయంలో పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధుల నుంచి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని కూడా మంత్రి స్పష్టం చేశారు.
ఇలా నిధుల విషయంలో పాత, కొత్త సర్పంచ్‌ల మధ్య కొనసాగుతున్న ఈ వివాదం తెలంగాణ గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని స్థానిక నాయకులు, ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.