TGSRTC DA Hike 2026: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త .. 2.1% డీఏ పెంపు, ఎప్పటి నుండి అమలు అంటే..!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెంపును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పెరిగిన డీఏ జనవరి 2026 నుంచి అమల్లోకి రానుంది, దీనివల్ల వేలాది మంది ఉద్యోగులకు ఆర్థిక ఊరట లభించనుంది.

Transport Minister Ponnam Prabhakar holding a review meeting with TGSRTC officials regarding DA release and employee welfare.
Transport Minister Ponnam Prabhakar holding a review meeting with TGSRTC officials regarding DA release and employee welfare.

TGSRTC DA Hike 2026: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న 2.1 శాతం డీఏను విడుదల చేస్తూ, దానిని జనవరి 2026 నుంచే అమలు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) ను 2.1 శాతం పెంచుతూ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.ఇంతకుముందు 50.7 శాతంగా ఉన్న డీఏ, తాజా పెంపుతో 52.8 శాతానికి చేరింది. ఈ నిర్ణయం జనవరి 2026 నుంచే అమల్లోకి రానుందని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ పెంపు వారికి ఆర్థికంగా కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.

అద‌న‌పు భారం..

డీఏ పెంపుతో ఆర్టీసీపై ప్రతి నెల సుమారు రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను మూడు నెలల పాటు సప్లిమెంటరీ బిల్లుల రూపంలో విడతలవారీగా చెల్లించనున్నారు.

TGSRTC DA Hike 2026
TGSRTC DA Hike 2026

ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రజా ప్రభుత్వం ప్రారంభం నుంచే ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం అనే మూడు ముఖ్య లక్ష్యాలతో పనిచేస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డీఏను విడుదల చేయడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.

ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి కూడా ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొంటూ, ఈ పెంపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.తెలంగాణలో ప్రజల జీవనాడిగా నిలిచిన ఆర్టీసీని మరింత బలోపేతం చేసి, సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు వెల్లడించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »