- ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్‌మెంట్ అమలు, గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ఆదేశాలు
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- జూలై 1, 2026 నుంచి ఫిట్‌మెంట్ అమలు
ఆర్టీసీ ఉద్యోగులకు కీలక ప్రకటనలు
ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ప్రయాణికులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్పీఎస్-2021 కింద 11 శాతం ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.
అదేవిధంగా, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల అధికారితో చర్చించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
30 నెలల్లో 2,815 కొత్త బస్సులు
2023-26 మధ్యకాలంలో ప్రజాపాలన ప్రభుత్వం రూ.1,078 కోట్ల వ్యయంతో 2,815 కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఏటూరునాగారం, పెద్దపల్లి ప్రాంతాల్లో రెండు కొత్త డిపోలను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ వద్ద 10,173 బస్సులు, 38,128 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, రోజుకు 35 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించి సుమారు 61 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
నాగర్‌కర్నూల్, పెద్దపల్లి డిపో పనులు వేగవంతం
నాగర్‌కర్నూల్, పెద్దపల్లి బస్ డిపో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే ములుగు బస్ స్టేషన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
వారం రోజుల్లో వేములవాడ, కథలాపూర్ బస్ స్టేషన్లకు శంకుస్థాపన నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధిర, హుజూర్‌నగర్, కోదాడ, నాగర్‌కర్నూల్ బస్ స్టేషన్ల నిర్మాణ, పునరుద్ధరణ పనులపై కూడా ప్రత్యేకంగా సమీక్షించారు.
మంచిర్యాల, చెన్నూరు, మెదక్, బెల్లంపల్లి, పరకాల, ములకనూరు, ధర్మపురి, మక్తల్ ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేకంగా పర్యటించి బస్ స్టేషన్ల నిర్మాణం లేదా పునరుద్ధరణ అవసరాలపై నివేదిక సమర్పించాలని సూచించారు.
శంకర్ కుటుంబానికి రూ.1 కోటి సాయం
ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులతో రూ.1 కోటి చెక్కు అందజేయాలని, కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ఉద్యోగుల ప్రమాద బీమా పథకం కింద ఇప్పటివరకు 11 కేసులను పరిష్కరించి, ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్సులు, దక్షిణాది రాష్ట్రాల సమావేశం
ప్రస్తుతం రాష్ట్రంలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, అవి ఏ రూట్లలో నడుస్తున్నాయి, లాభదాయక మార్గాలు ఏవి, నష్టాలు వస్తున్న రూట్లు ఏవి అనే అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
అలాగే కాలుష్య నియంత్రణ, ఈవీ విధానం, ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ అంశాలపై త్వరలో దక్షిణ భారత రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, ఆర్టీసీ ఎండీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు.


