నిర్మాతలు-ఎగ్జిబిటర్ల వివాదం తారస్థాయికి ..తెలంగాణలో థియేటర్ల బంద్, పెద్ద సినిమాల‌కి ఇబ్బందే..!

రెవెన్యూ షేరింగ్‌పై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మే 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం సమ్మర్ రిలీజ్‌లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

An empty single screen cinema hall in Telangana representing the upcoming strike and shutdown.
An empty single screen cinema hall in Telangana representing the upcoming strike and shutdown.

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆదాయంలో వాటా విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లను మే 1వ తేదీ నుంచి నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

సంక్షోభంలోకి..

థియేటర్ యజమానులు చెబుతున్నదేమిటంటే, ప్రస్తుత రెంటల్ పద్ధతి వల్ల తాము భారీగా నష్టపోతున్నామని. నిర్వహణ ఖర్చులు పెరగడం, ప్రేక్షకుల రాక తగ్గిపోవడం, ఓటీటీ ప్రభావం అన్నీ కలిసి థియేటర్ వ్యాపారాన్ని సంక్షోభంలోకి నెట్టాయని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్‌ల తరహాలో రెవెన్యూ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొదటి వారం 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం వాటా ఇవ్వాలని ప్రతిపాదించారు.

ఇక నిర్మాతల వర్గం మాత్రం ఈ డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అభిప్రాయం ప్రకారం, ఇప్పటికే సినిమా నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేస్తే నిర్మాతలకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.

పరిష్కారం రావ‌డం లేదు..

ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన పరిష్కారం దొరకలేదు. ఏప్రిల్ 30లోగా సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు.

ఈ వివాదం ప్రభావం మే నెలలో విడుదల కావాల్సిన పలు చిత్రాలపై పడే అవకాశముంది. ముఖ్యంగా స్వయంభూ (నిఖిల్ సిద్ధార్థ్), మా ఇంటి బంగారం (సమంత), కొరియన్ కనకరాజు, సూర్య కరుప్పు వంటి సినిమాల విడుదలలు అనిశ్చితిలో పడే అవకాశం ఉంది.

స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో పెద్ద సినిమాలు..

సమ్మర్ సీజన్ సాధారణంగా తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు అత్యంత కీలకం. ఈ సమయంలో థియేటర్లు మూతపడితే భారీ ఆర్థిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది. అందుకే ఈ వివాదానికి త్వరగా ముగింపు పలకాలని సినీ పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నాయి.

మొత్తంగా, నిర్మాతలు-ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న ఈ వివాదం పరిష్కారం కాకపోతే, తెలుగు సినిమా రంగంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Also read: 

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »