హన్మకొండ/వరంగల్: కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి నిదర్శనమైన హన్మకొండలోని చారిత్రక శ్రీ రుద్రేశ్వర స్వామి (వేయి స్తంభాల) దేవాలయం సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యా నిరంతర కృషి ఫలితంగా, కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మేరకు రూ. 14.44 కోట్లు మంజూరు చేశారు.

ఏం పనులు చేపట్టనున్నారు?
- ఈ నిధులతో 12వ శతాబ్దపు ఈ కట్టడానిని పూర్వ వైభవం తీసుకువచ్చేలా పలు కీలక పనులు నిర్వహించనున్నారు:
- కల్యాణ మండపం పూర్తి: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కల్యాణ మండపం పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తారు.
- సుందరీకరణ: ఆలయ ప్రాంగణంలో అత్యాధునిక లైటింగ్ (Facade Illumination) మరియు గార్డెనింగ్‌ను అభివృద్ధి చేస్తారు.
- కోనేరు పునరుద్ధరణ: ఆలయ కోనేరును ప్రక్షాళన చేసి, దానికి కొత్త మెరుగులు దిద్దుతారు.
- మౌలిక సదుపాయాలు: అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, వాటర్ లైన్లు మరియు యాత్రికుల కోసం ప్రత్యేక సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.
ఎంపీ కడియం కావ్యా చొరవ:
ఈ నిధుల సాధన కోసం ఎంపీ కావ్యా గారు గతేడాది నుంచి తీవ్రంగా కృషి చేస్తున్నారు. భారత పురావస్తు శాఖ (ASI) అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆలయ స్థితిగతులపై కేంద్ర మంత్రికి సమగ్ర నివేదిక (DPR) అందజేశారు. తొలుత రూ. 10 కోట్లు కోరగా, ఆలయ అవసరాలను గుర్తించిన కేంద్రం దానిని రూ. 14.44 కోట్లకు పెంచడం విశేషం.

ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ASI హైదరాబాద్ సర్కిల్ ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ పనులు ప్రారంభం కానున్నాయని అధికారులు వెల్లడించారు. ఇది పూర్తయితే వరంగల్ పర్యాటక రంగం మరో మెట్టు పైకి ఎదుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


