AP Weather | ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. హీట్‌వేవ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించే చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎండల తీవ్రత, వడదెబ్బ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also : మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40వేలు.. నరసన్నపేటలో ప్రకటించిన చంద్రబాబు..
దంచికొట్టిన ఎండలు..
ఏపీలో శుక్రవారం సైతం ఎండల తీవ్రత కొనసాగింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా దేవరపల్లి, ఎన్టీఆర్ జిల్లా తోర్రగుడిపాడు ప్రాంతాల్లో కూడా 44.7 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. చొప్పున భారీ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల వరకు చేరుకోవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. అలాగే, ఈ నెల 27 వరకు వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండలతో జనం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. పగటి వేళల్లోనే కాకుండా రాత్రిపూట కూడా ఉక్కపోత తగ్గకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో వీచే వేడి గాలులు బయటకు రావాలన్నా భయపడే పరిస్థితిని నెలకొంది.
విశాఖలో వర్షం
ఇదిలా ఉండగా.. విశాఖపట్నంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఎండలతో అల్లాడిన జనాలకు వర్షం ఊరటనిచ్చింది. ఉదయం నుంచి మండుతున్న ఎండలు, భరించలేని ఉక్కపోతతో ఇబ్బంది పడిన నగరవాసులు ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఉపశమనం పొందారు. జగదంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబా గార్డెన్స్, బీచ్ రోడ్, మధురవాడ, రిషికొండ, ఎండాడ, ఆరిలోవ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం నగర వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. రోజంతా వేడితో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రానికి ఇళ్ల బయటకు వచ్చి చల్లని గాలులను ఆస్వాదించారు. ముఖ్యంగా బీచ్ రోడ్ పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. నగరంలోని 104 ఏరియా బాపూజీనగర్‌లో పిడుగు పడింది. భారీ శబ్దంతో పిడుగు పడటంతో అక్కడి కొబ్బరి చెట్టుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Read Also : చంద్రబాబు కాన్వాయ్‌లో కీలక మార్పులు.. కుప్పం పర్యటనలో ఏం జరిగిందం..?


