Adani Green Energy | ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్ కడప జిల్లాలో 2,250 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు (Pumped Storage Project) నిర్మాణానికి అదానీ గ్రీన్ ఎనర్జీ అనుబంధ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీకి అనుమతులు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ‘గండికోట-2’ పేరుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వైఎస్సార్ కడప జిల్లాలోని లార్డ్ బాలాజీ దొంతికోన పీఎస్పీ పార్కులో ఏర్పాటు కానుంది.
Read Also : భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు..!
ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే అతిపెద్ద పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ప్రస్తుతం కీలకంగా మారాయి. సౌర, పవన విద్యుత్ అధికంగా ఉత్పత్తి అయ్యే సమయంలో మిగులు విద్యుత్‌తో నీటిని ఎత్తైన ప్రాంతాలకు పంపించి, అవసరమైన సమయంలో తిరిగి కిందకు వదిలి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానమే ఈ ప్రాజెక్టుల ప్రత్యేకత. దీంతో 24 గంటల పాటు స్థిరమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, డేటా సెంటర్లకు భవిష్యత్తులో భారీగా విద్యుత్ అవసరం ఉండనుంది. ఈ నేపథ్యంలో గండికోట-2 ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also : YS Jagan | ఆక్వా ఫీడ్ ధరల పెంపు రగడ.. ఏపీలో వైసీపీ-టీడీపీ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం..!
ఈ ప్రాజెక్టు కోసం గండికోట జలాశయం నుంచి ఒకేసారి నింపడానికి 29.20 ఎంసీఎం నీటిని, ప్రతి ఏడాది ఆవిరి నష్టాల కోసం మరో 2.20 ఎంసీఎం నీటిని కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 కింద ఈ ప్రాజెక్టుకు పలు ప్రోత్సాహకాలు కూడా లభించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీ ద్వారా సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుంది. గండికోట-2 ప్రాజెక్టును ఆరు ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. వేగవంతమైన అనుమతులు, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలతో రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Read Also : ఏపీలో విస్తరణపై ఉబెర్ దృష్టి.. సీఎం చంద్రబాబుతో గ్లోబల్ సీఈఓ భేటీ..!


