CM Chandrababu | మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40వేలు ప్రభుత్వం అందిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో సవర ఆర్ట్ గ్యాలరీ వద్ద గిరిజన కళాకారులు ప్రత్యేకంగా తయారు చేసిన ఓవర్‌కోట్‌ను కొనుగోలు చేసి ధరించారు. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో చేపల సాగుతో పాటు సీవీడ్ సాగు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన వినూత్న ‘హెల్మెట్ బ్యాంక్’ కార్యక్రమాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం హెల్మెట్ ధరించి బుల్లెట్ వాహనాన్ని స్వయంగా నడిపి అందరినీ ఆకట్టుకున్నారు.
Read Also : పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మహర్దశ: పవన్ కళ్యాణ్ కృషితో రూ. 37.25 కోట్లు మంజూరు.. అమృత్ భారత్ పథకంలోకి చేరిక!
పేదరికం లేని సమాజమే లక్ష్యం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజం మారితేనే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని అన్నారు. తలసరి ఆదాయం పెంచడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావడం అధికారుల కృషి వల్లే సాధ్యమవుతుందన్నారు. గతంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన పరిస్థితి నుంచి ఇప్పుడు పిల్లలే సంపద అనే ఆలోచనకు వచ్చామన్నారు. మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తామని ప్రకటించారు. అలాగే, తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు అందిస్తున్నామని, అవసరమైతే ఈ మొత్తాన్ని పెంచుతామని వెల్లడించారు.
Read Also : టీటీడీ అన్నదాన పథకానికి 40 ఏళ్లు: ఎన్టీఆర్ సంకల్పం.. లక్కిశెట్టి వెంకటరామయ్య త్యాగం! తెరపైకి ఆసక్తికర చర్చ
అభివృద్ధి, స్వచ్ఛతపై..
గత ప్రభుత్వ పాలనలో ప్రజల ఆస్తులు గందరగోళానికి గురయ్యాయని సీఎం పరోక్షంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. గత పదహారు నెలలుగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని సూచించారు. అలాగే ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని, కలెక్టర్ల ఆధ్వర్యంలో రోజువారీ శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని, దాంతో లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖకు గూగుల్ వంటి పెద్ద సంస్థ రావడం ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గి, పరిశ్రమలు ఈ ప్రాంతానికి రావాలన్నదే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
Read Also : భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు..!


