Uber | ప్రపంచవ్యాప్తంగా క్యాబ్ సేవలు అందిస్తున్న ఉబర్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నది. ఈ నేపథ్యంలో ఉబెర్ గ్లోబల్ సీఈఓ దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, టెక్నాలజీ రంగ విస్తరణ, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. సమావేశం అనంతరం చంద్రబాబు స్పందిస్తూ, విశాఖపట్నంలో ఇప్పటికే కొనసాగుతున్న ఉబెర్ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మరింత విస్తరించే యోచనలో సంస్థ ఉందని తెలిపారు.
Read Also :భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు..!
దేశవ్యాప్తంగా తమ సేవలకు అవసరమైన టెక్నికల్ టాలెంట్ కోసం ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా ఉబెర్ పరిశీలించడం సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో అభివృద్ధి చెందుతున్న క్వాంటం టెక్నాలజీ వ్యవస్థపై కూడా ఉబెర్ ప్రత్యేక ఆసక్తి కనబరిచినట్లు సీఎం వెల్లడించారు. భవిష్యత్ రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో ఆధునిక అల్గారిథమ్‌ల రూపకల్పనకు ఈ సాంకేతికతను వినియోగించుకునే అవకాశాలను కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Read Also : YS Jagan | ఆక్వా ఫీడ్ ధరల పెంపు రగడ.. ఏపీలో వైసీపీ-టీడీపీ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం..!
ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉబెర్ గ్లోబల్ లీడర్‌షిప్‌తో జరిగిన చర్చల్లో టెక్నాలజీ, పట్టణ రవాణా భవిష్యత్, ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని చెప్పారు. ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యం రాష్ట్రానికి కొత్త అవకాశాలను తీసుకురాగలదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంతో ఐటీ, మొబిలిటీ, ఆధునిక సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also : టీచర్ ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!


