YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా ఫీడ్ ధరల పెంపు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో కుమ్మక్కై రైతులపై భారం మోపుతోందని ఆయన ఆరోపించారు. ఫీడ్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన జగన్, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ముఖ్యంగా ఆక్వా రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also : భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు..!
“ప్రభుత్వ పాలనలో ప్రతి రంగంలోనూ అన్యాయం జరుగుతోంది. చివరికి ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కూడా కంపెనీలతో ఒప్పందాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు” అని జగన్ ఆరోపించారు. ఫీడ్ కంపెనీల యాజమాన్యాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, కమీషన్ల వ్యవహారాలే ధరల పెంపుకు కారణమని ఆయన విమర్శించారు. ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోవడం అనుమానాలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. సిండికేట్లు, మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (APSADA) ద్వారా సీడ్, ఫీడ్ ధరలు, నాణ్యతపై నియంత్రణ తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు.
Read Also : టీచర్ ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
అంతేకాకుండా ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్‌ను తక్కువ ధరకు అందించామని, ఉత్పత్తులకు మద్దతు ధరల విధానం కూడా అమలు చేసినట్లు చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని జగన్ విమర్శించారు. ఏపీఎస్‌ఏడీఏ అనుమతి లేకుండా కంపెనీలు ధరలు పెంచాయన్న ప్రభుత్వ వాదనను కూడా ఆయన తప్పుబట్టారు. “ప్రభుత్వం, చట్టాన్ని ధిక్కరించే స్థాయికి కంపెనీలు ఎలా చేరాయి? వెనుక ఎవరున్నారు?” అని ప్రశ్నించారు. తాత్కాలికంగా ధరల పెంపును నిలిపివేశామన్న ప్రకటన సరిపోదని, పెంపును పూర్తిగా రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ అంశంపై రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైసీపీ అధినేత స్పష్టం చేశారు.


