విజయవాడని తాకిన గ్యాస్ కొరత ప్రభావం.. హోటల్స్‌లో సాంబార్ కట్, ప‌లు హోటల్స్ తాత్కాలికంగా మూత

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో విజయవాడలో హోటల్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని హోటల్స్ మెనూలో సాంబార్ వంటి ఐటమ్స్ తొలగించగా, మరికొన్ని హోటల్స్ తాత్కాలికంగా మూసివేశారు.

Vijayawada Gas Crisis

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఇప్పుడు స్థానిక మార్కెట్లపై కూడా పడుతోంది. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో విజయవాడలోని హోటల్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

కొన్ని హోటల్స్ మెనూ ఐటమ్స్ తగ్గించగా, మరికొన్ని పూర్తిగా మూతపడ్డాయి. ముఖ్యంగా టిఫిన్‌లకు తప్పనిసరిగా ఇచ్చే సాంబార్‌ను కూడా పలు హోటల్స్ మెనూలో నుంచి తొలగించాల్సి వచ్చింది.

విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న ప్రముఖ శ్రీ సత్యసాయి హోటల్ ఈ పరిస్థితికి ఉదాహరణగా నిలుస్తోంది. ఇక్కడ సాంబార్ ఇడ్లీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రతి ఉదయం ఈ హోటల్ ముందు పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తుంటాయి. అయితే ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో సాంబార్‌తో పాటు కొన్ని ఇతర ఐటమ్స్‌ను మెనూలో నుంచి తొలగించినట్టు హోటల్ నిర్వాహకులు బోర్డులు పెట్టారు. దీంతో సాంబార్ అభిమానులకు నిరాశ తప్పలేదు.

తాత్కాలికంగా మూసివేత‌..

ఇక నగరంలోని మరో ప్రసిద్ధ హోటల్ గుడ్ మార్నింగ్ కూడా గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా మూతపడింది. ప్రస్తుతం అక్కడ కేవలం టీ, కాఫీ కౌంటర్ మాత్రమే నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో టిఫిన్‌లు, భోజనాల తయారీకి గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Also Read: కాంగ్రెస్‌కు షాక్.. పార్టీని వీడనున్న మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి, రాజకీయాల్లో కీలక మలుపు

విజయవాడలోని కొన్ని ఆలయాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ప్రైవేటు ఆధ్వర్యంలో నడిచే కొన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో తాత్కాలికంగా ప్రసాదాల పంపిణీకి కూడా ఆటంకం ఏర్పడింది. దీనిపై ఆలయాల వద్ద ప్రత్యేకంగా బోర్డులు కూడా పెట్టినట్లు సమాచారం.

పెరిగిన క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ డిమాండ్..

హైదరాబాద్‌తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ నగరాల్లో గ్యాస్ కొరత ప్రభావం కొంత ఆలస్యంగా కనిపించింది. హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టల్స్, మెస్‌లు ఎక్కువగా ఉండటంతో ముందుగా అక్కడే కమర్షియల్ గ్యాస్ డిమాండ్ పెరిగి కొరత ఏర్పడింది. ఇప్పుడు అదే ప్రభావం నెమ్మదిగా విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలకు కూడా చేరుతోంది.

ప్రస్తుతం ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన సరఫరా వ్యవస్థలో సమస్యలు తలెత్తినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో కమర్షియల్ గ్యాస్ కొరత మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే గృహ వినియోగానికి ఉపయోగించే LPG గ్యాస్ సరఫరాపై ఎలాంటి సమస్య లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పరిస్థితిని సమీక్షించింది. ఇళ్లకు సరఫరా చేసే గ్యాస్ బండ్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ తెలిపారు.

సాధార‌ణ ప‌రిస్థితికి ఎప్పుడు వ‌స్తుందో..

అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వంట గ్యాస్ సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. LPG సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. అయితే హోటల్స్, రెస్టారెంట్లు వంటి వ్యాపార అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ విషయంలో మాత్రం తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తంగా కమర్షియల్ గ్యాస్ కొరత ప్రభావం విజయవాడ హోటల్ వ్యాపారంపై పడుతుండగా, పరిస్థితి సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందో అన్నదానిపై వ్యాపారులు, వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »