బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు భారీగా తగ్గడం దేశీయ మార్కెట్లపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపించింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు గత సెషన్‌లో ఔన్సుకు సుమారు 5,000 డాలర్లకు సమీపంలో ఉండగా ప్రస్తుతం అది 4,880 డాలర్ల స్థాయికి చేరింది. ఒక్కరోజు వ్యవధిలోనే 100 డాలర్లకుపైగా పడిపోవడం గమనార్హం. ఇదే సమయంలో వెండి ధర కూడా ఔన్సుకు 75 డాలర్ల స్థాయి నుంచి 73 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ తగ్గుదల ప్రభావంతో దేశీయంగా కూడా పసిడి, వెండి ధరలు పతనమయ్యాయి.
మరింత తగ్గే అవకాశం..
ఫిబ్రవరి 18 ఉదయం 10 గంటల తర్వాత మరింత తగ్గుదల నమోదయ్యే అవకాశముందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే 22 క్యారెట్ బంగారం ధర తులానికి రూ. 2,050 మేర తగ్గి రూ. 1,41,350 వద్ద కొనసాగుతోంది. కిందటి రోజు కూడా రూ. 1,200 తగ్గడం గమనించదగ్గ విషయం. అంతకుముందు వారంలో వరుస సెషన్లలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తిరిగి దిగివస్తుండటం కొనుగోలుదారులకు అనుకూలంగా మారింది. మరోవైపు 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కూడా రూ. 2,240 తగ్గి 10 గ్రాములకు రూ. 1,54,200 వద్ద నిలిచింది. ఇది కిందటి రోజు రూ. 1,310 మేర పడిపోయింది. బంగారం ధరలు తగ్గినా వెండి మాత్రం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది.
వెండి పెరుగుదల లేదు..
హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2.65 లక్షల వద్ద ఉంది. కిందటి రోజు రూ. 15 వేల మేర తగ్గగా, ఫిబ్రవరి 13న చివరిసారిగా రూ. 20 వేల తగ్గుదల నమోదైంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే గత 8 రోజులలో ఒక్కరోజు కూడా వెండి ధర పెరగలేదు. జనవరి 29న ఒక దశలో కిలోకు రూ. 4.25 లక్షల ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన వెండి ధర అక్కడి నుంచి దాదాపు రూ. 1.60 లక్షల మేర పడిపోవడం విశేషం. ఇటీవల బంగారం, వెండి ధరలు గరిష్ఠాలకు చేరుకోవడంతో పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడం కూడా ఈ పతనానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికన్ డాలర్ బలపడటం కూడా బంగారం ధరలపై ఒత్తిడి తెస్తోంది.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు తగ్గిపోవడం కూడా పసిడి ధరలు పడిపోవడానికి దోహదపడుతోంది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి, కానీ ప్రస్తుతం ఆ అంచనాలు మందగించడంతో బంగారం మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ ధరల పతనం తాత్కాలికమా లేక దీర్ఘకాలిక ధోరణిగా మారుతుందా అన్నది అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్ మార్పులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలపై ఆధారపడి ఉండనుంది. ప్రస్తుతం మాత్రం ఈ తగ్గుదల ఆభరణాల కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారింది.