టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెహరీన్ పిర్జాదా ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఆదివారం రాత్రి ఆమె సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులకు ఇది సడన్ సర్‌ప్రైజ్‌గా మారింది. కొందరికి ఇది షాక్‌లా అనిపించినా, మెహరీన్ జీవితంలో కొత్త ఆరంభానికి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మెహరీన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె వివాహం ఏప్రిల్ 26, 2026న జరిగింది. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరగడం ఫోటోల ద్వారా స్పష్టమవుతోంది. వధువుగా మెహరీన్ సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా మెరిసిపోతుండగా, వరుడు కూడా అంతే అందంగా ఆకట్టుకుంటున్నారు.
ఎవరు ఇతను..
మెహరీన్ భర్త పేరు అర్ష్ ఔలాఖ్. ఆయన ఒక వ్యాపారవేత్త అని సమాచారం. సినీ రంగానికి సంబంధం లేకుండా ఉండే వ్యక్తిని ఆమె జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెద్దలు కుదిర్చిన వివాహంగా ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఇరువురు పరిచయం పెంచుకుని, పరస్పర అంగీకారంతో ఈ బంధంలోకి అడుగుపెట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, మెహరీన్ సినీ ప్రయాణం గురించి మాట్లాడుకుంటే, ఆమె తొలి చిత్రం కృష్ణగాడి వీర ప్రేమ గాధ. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, తరువాత వరుసగా పలు విజయాలను అందుకున్నారు. మహానుభావుడులో శర్వానంద్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే రాజా ది గ్రేట్లో రవితేజతో జంటగా కనిపించారు.
View this post on Instagram
వరుస చిత్రాలతో సందడి..
అలాగే ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో వరుణ్ తేజ్ సరసన నటించి బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించారు. ముఖ్యంగా ‘హానీ ఈజ్ ద బెస్ట్’ అనే డైలాగ్‌తో ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.
తెలుగుతో పాటు పంజాబీ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా నటించిన మెహరీన్ ప్రస్తుతం సినిమాల ఎంపికలో కొంత విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘స్పార్క్ లైఫ్’ తర్వాత ఆమె తెలుగులో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ఒక కన్నడ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి, ఎలాంటి హడావుడి లేకుండా సడన్‌గా పెళ్లి చేసుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసిన మెహరీన్, ఇప్పుడు తన జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టారు. ఈ జంట సంతోషంగా జీవించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


