ముస్సూరీలో కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుకలు.. ఏయే క్రియేట‌ర్స్ హాజ‌రు కానున్నారో తెలుసా?

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహ వేడుకలు ముస్సూరీలో ఘనంగా జరగనున్నాయి. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను మార్చి 14న వివాహం చేసుకోనున్న కుల్దీప్ పెళ్లికి పలువురు ప్రముఖ క్రికెటర్లు, వీఐప

Kuldeep Yadav Wedding

భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహ వేడుకలకు ప్రముఖ హిల్ స్టేషన్ ముస్సోరి వేదికగా మారుతోంది. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో ఆయన మార్చి 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముస్సూరీలోని చారిత్రాత్మకమైన ది సావోయ్ హోటల్‌లో ఈ వివాహ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుక కోసం హోటల్‌ను మూడు రోజుల పాటు పూర్తిగా రిజర్వ్ చేసినట్టు సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వీఐపీలు పాల్గొనే ఈ వివాహ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ప్ర‌ముఖ క్రికెట‌ర్స్‌కి ఆహ్వానం

ఈ పెళ్లి వేడుకకు భారత క్రికెట్ ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు పలువురు క్రికెటర్లు కూడా హాజరవుతారని సమాచారం. వీరితో పాటు మరికొంత మంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు.

Also Read: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. గ్యాస్ కొరతతో ఐటీ కంపెనీల్లో ఆంక్షలు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

హోటల్ మేనేజ్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం, సావోయ్ హోటల్‌లో సుమారు 80 గదులు బుక్ చేశారు. అదనంగా వీఐపీలు, కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బందికి సమీపంలోని ఇతర లగ్జరీ హోటళ్లలో కూడా వసతి ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది.

ప్రేమ పెళ్లి

కుల్దీప్ యాదవ్ – వంశికల ప్రేమకథ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన బాల్య స్నేహితులు. కుల్దీప్ లాల్ బంగ్లా ప్రాంతానికి చెందినవాడు కాగా, వంశిక ష్యామ్ నగర్‌లో నివసిస్తుంది. ప్రస్తుతం వంశిక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తోంది. ఆమె ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్నత విద్య కూడా అభ్యసించింది.

కుల్దీప్ అండర్-19 క్రికెట్ రోజుల నుంచే వంశిక అతని జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. వారి కుటుంబాలు కూడా ఒకరికొకరు పరిచయమే కావడంతో ఈ స్నేహం తరువాత ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధానికి దారి తీసింది. ఇద్దరి నిశ్చితార్థం 2025 జూన్ 4న లక్నోలో సంప్రదాయ పద్ధతిలో జరిగింది. మొదట ఈ పెళ్లిని 2025 నవంబర్‌లో జరపాలని భావించారు. అయితే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు తరఫున ఆడాల్సి ఉన్న నేపధ్యంలో పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం.

కుల్దీప్ కెరీర్

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో కుల్దీప్ యాదవ్ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 365కిపైగా అంతర్జాతీయ వికెట్లు తీసి ప్రపంచ అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.

ముస్సూరీలో జరిగే ఈ ప్రైవేట్ వివాహం అనంతరం, మార్చి 17న లక్నోలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈ జంట గ్రాండ్ రిసెప్షన్ జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని సమాచారం. టీ20 వరల్డ్‌కప్ విజయోత్సాహం తర్వాత కుల్దీప్ యాదవ్ జీవితంలో మరో ముఖ్యమైన సంబరం జరగబోతోంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »