Garividi Lakshmi Movie Review: ఆనంది పరకాయ ప్రవేశం.. సినిమా ఎలా ఉందంటే?

Garividi Lakshmi Movie Review: ఆనంది ప్రధాన పాత్రలో నటించిన గరివిడి లక్ష్మి బయోపిక్ ఎలా ఉంది? కథ, దర్శకత్వం, నటీనటుల పెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాలపై పూర్తి మూవీ రివ్యూ.

Garividi Lakshmi Movie Review
Garividi Lakshmi Movie Review

Garividi Lakshmi Movie Review: బయోపిక్ సినిమాలు అంటే సాధారణంగా అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ‘మహానటి’. సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన ఆ సినిమా.. ఆ తర్వాత వచ్చిన బయోపిక్స్‌కు ఒక రకంగా బెంచ్‌మార్క్‌గా నిలిచింది. అయితే పెద్దగా పరిచయం లేని ఓ గ్రామానికి చెందిన మహిళ జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తే ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే ప్రశ్న సహజంగానే ఉంటుంది. అలాంటి ప్రయత్నమే ‘గరివిడి లక్ష్మి’. మరి ఈ సినిమా ఎలా ఉంది? గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఎలా నటించింది?

కథేంటి?

గరివిడి గ్రామానికి చెందిన విజయలక్ష్మి చిన్నప్పటి నుంచే తండ్రి ప్రేమకు దూరంగా పెరుగుతుంది. చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది. అయితే భర్త మోసం చేయడంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. చివరకు ఒంటరి మహిళగా మిగిలిన విజయలక్ష్మికి అనుకోకుండా బుర్రకథ పరిచయం అవుతుంది.

ఆ తర్వాత బుర్రకథలు చెబుతూ ఆమె తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయాణమే ఈ సినిమా ప్రధాన కథ. విజయలక్ష్మి.. గరివిడి లక్ష్మిగా ఎలా మారింది? ఆమె జీవితంలో ఎదురైన కష్టాలు, అవమానాలు, మోసాలను ఎలా ఎదుర్కొంది? అనేది తెరపై చూడాలి.

ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది?

సినిమా కథ ఓ యువ దర్శకుడు గరివిడి లక్ష్మి జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నంతో ప్రారంభమవుతుంది. ఆమె బాల్యం నుంచి వివాహం వరకు.. ఆ తర్వాత ఎదురైన సమస్యలు, బుర్రకథ ఆమె జీవితంలోకి ఎలా వచ్చింది అనే అంశాలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ కథ ముందుకు సాగుతుంది.

ఫస్ట్ హాఫ్‌లో ప్రధానంగా గరివిడి లక్ష్మి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడంపైనే దర్శకుడు దృష్టి పెట్టాడు. ఆమె జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు చాలావరకు సక్సెస్ అయ్యాడు. పాత్ర ఎదుగుదలను చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లడంతో సినిమా ఆసక్తికరంగానే అనిపిస్తుంది.

ఎమోషనల్‌గా సెకండ్ హాఫ్

సెకండ్ హాఫ్‌లో సినిమా మరింత ఎమోషనల్‌గా మారుతుంది. గరివిడి లక్ష్మి జీవితంలో ఎదురైన అవమానాలు, మోసాలను దర్శకుడు తెరపై చూపించాడు. వాటికి ప్రతీకారం తీర్చుకోవడం కంటే తనదైన మార్గంలో ముందుకు సాగుతూ ప్రత్యేకమైన జీవితాన్ని నిర్మించుకున్న విధానాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు.

బయోపిక్‌లో నిజ జీవితంలోని ఎత్తుపల్లాలను సమతూకంగా చూపించడం కీలకం. ఈ విషయంలో దర్శకుడు మంచి ప్రయత్నం చేశాడు. గరివిడి లక్ష్మి పాత్రను ప్రేక్షకులు తమ సొంత మనిషిలా భావించేలా పాత్రను తీర్చిదిద్దారు.

ముఖ్యంగా చివరి అరగంట సినిమాకు మంచి ఎమోషనల్ బలం తీసుకొచ్చింది. అయితే అక్కడక్కడా కమర్షియల్ అంశాలు కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విషయంలో సినిమా పెద్దగా నిరాశపరచదు.

దర్శకురాలిగా కృతి ప్రసాద్

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. పెద్దగా పరిచయం లేని ఓ మహిళ జీవితాన్ని తీసుకుని దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరపైకి తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు.

అయితే ఓ మట్టి కథను సహజమైన ఫీల్‌తో తెరకెక్కించడంలో కృతి ప్రసాద్ చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. సినిమా ఎక్కడా అవసరం లేని అడల్ట్ సన్నివేశాలు లేదా ఎబ్బెట్టుగా అనిపించే సన్నివేశాలతో నింపలేదు. ఓ మనిషి జీవితంలోని ఎత్తుపల్లాలను అవసరమైనంత ఎమోషన్‌తో చూపించే ప్రయత్నం చేశారు.

మొదటి సినిమా అనే భావన కొన్ని సందర్భాల్లో పెద్దగా కనిపించదు. కథను ఎక్కడ నెమ్మదింపాలో, ఎక్కడ ఎమోషన్‌ను పెంచాలో దర్శకురాలు జాగ్రత్త తీసుకున్నట్లు అనిపిస్తుంది.

ఆనంది నటన

గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది పరకాయ ప్రవేశం చేసింది. ఈ పాత్రకు ఆమె పూర్తిగా సరిపోయిందనే చెప్పాలి. సినిమాలో ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

విజయలక్ష్మి జీవితంలోని విభిన్న దశలను, బాధను, సంఘర్షణను, ఆత్మవిశ్వాసాన్ని ఆనంది సహజంగా పలికించింది. ఈ పాత్రలో మరో నటిని ఊహించుకోవడం కూడా కష్టమే అనిపించే స్థాయిలో ఆమె నటన ఉంది.

రాశి పాత్ర కూడా బాగా డిజైన్ చేశారు. ఆమె తన పాత్రకు తగ్గట్టుగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా తమకు ఇచ్చిన పాత్రల పరిధిలో మెప్పించారు.

టెక్నికల్‌గా ఎలా ఉంది?

దర్శకురాలు మంచి కథను ఎంచుకోవడంతో పాటు దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలోనూ తనవంతు ప్రయత్నం చేశారు.

విజయనగరం నేపథ్యంలో కథ సాగడంతో అక్కడి నేటివిటీని సినిమాలో తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతీయ పదాలు, డైలాగ్స్ అందరికీ వెంటనే అర్థం కాకపోవచ్చు. అయితే ఎక్కువ భాగం సంభాషణలు సులభంగానే అర్థమయ్యేలా ఉన్నాయి.

ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితనం చాలా ఫ్రేముల్లో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా కథలోని మూడ్‌ను క్యారీ చేయడంలో సహాయపడింది. రన్‌టైమ్ కూడా కథకు తగ్గట్టుగా సెట్ చేసినట్లు అనిపిస్తుంది.

సంగీతం విషయానికి వస్తే చరణ్ అర్జున్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

చివరగా..

‘గరివిడి లక్ష్మి’ చెడ్డ సినిమా అయితే కాదు. పెద్దగా పరిచయం లేని ఓ మహిళ జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కించి ప్రేక్షకులకు కనెక్ట్ చేయాలనే ప్రయత్నంలో దర్శకురాలు కృతి ప్రసాద్ చాలావరకు సక్సెస్ అయ్యారు.

ఆనంది నటన, ఎమోషనల్ సెకండ్ హాఫ్, కథలోని నేటివిటీ సినిమాకు ప్రధాన బలాలు. అక్కడక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గినప్పటికీ.. ఒక సహజమైన బయోపిక్ చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్: 3/5

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »