Haiwaan Movie Review: చాలా ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని తెలిసినప్పుడు ఆసక్తి కలిగింది. అందులోనూ సైఫ్ అలీ ఖాన్ హీరోగా, ప్రియదర్శన్ దర్శకత్వంలో సినిమా అంటే(Haiwaan Movie Review) అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇది ప్రియదర్శన్ గతంలో తెరకెక్కించిన మలయాళ సినిమా రీమేక్ అని తెలిసిన తర్వాత ఆ ఆసక్తి కొంత తగ్గింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? ఇప్పుడు చూద్దాం.
కథేంటి?
శ్యామ్ అనే అంధుడు ఓ హైసొసైటీలో కేర్‌టేకర్‌గా పనిచేస్తుంటాడు. అనుకోకుండా ఒక రోజు తన అపార్ట్‌మెంట్‌లో ఓ రిటైర్డ్ జడ్జిని ఒక వ్యక్తి హత్య చేయడాన్ని గమనిస్తాడు. అయితే ఆ హత్య చేసిన వ్యక్తి ఎవరు? అతను ఎందుకు వరుస హత్యలకు పాల్పడుతున్నాడు? అంధుడైన శ్యామ్ ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాడు? తాను చేయని హత్యలో తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటాడు? అనేదే సినిమా ప్రధాన కథ.
సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్
సినిమాలో ప్రధానంగా ఇద్దరు పాత్రలపైనే కథ నడుస్తుంది. సాధారణంగా హీరో, విలన్ అనే ఫార్మాట్‌లో చాలా సినిమాలు వచ్చినా.. ఇక్కడ హీరో అంధుడిగా ఉండటం, విలన్ సైకోపాత్‌గా కనిపించడం ఆసక్తికరమైన పాయింట్‌గా అనిపిస్తుంది.
సైఫ్ అలీ ఖాన్ తన పాత్రలో చాలా బాగా నటించాడు. అంధుడి పాత్ర కాబట్టి కేవలం సానుభూతిని నమ్ముకోకుండా బాడీ లాంగ్వేజ్, హావభావాలు, వాయిస్ మాడ్యులేషన్, భావోద్వేగాలతో పాత్రను మోసుకెళ్లడం అంత సులభం కాదు. కానీ సైఫ్ ఈ పాత్రను చాలా నమ్మకంగా పోషించాడు. గత దశాబ్దంలో ఆయన చేసిన మంచి పాత్రల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు.
అక్షయ్ కుమార్ సైకోపాత్ పాత్రలో తనదైన ముద్ర వేశాడు. ఆయన వాయిస్ మాడ్యులేషన్, నవ్వు, ఎక్స్‌ప్రెషన్స్ పాత్రను మరింత భయానకంగా మార్చాయి. కొన్ని సన్నివేశాల్లో ఆయన ముఖ కవళికలు చూస్తేనే పాత్ర ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది. ఇద్దరి మధ్య పోటీగా సాగే సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి.
ఫస్ట్ హాఫ్ బలంగా ఉంది
సినిమాలో బాగా వర్కౌట్ అయిన అంశం ఫస్ట్ హాఫ్. అంధుడైన వ్యక్తిని ఓ సైకోపాత్ తన ఆటలోకి లాగడం, అయితే శ్యామ్ కూడా సాధారణ వ్యక్తి కాకపోవడం.. (Haiwaan Movie Review)ఈ కాన్సెప్ట్‌ను దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించాడు.
శ్యామ్ తన ముందున్న వ్యక్తి తనకంటే మూడు అడుగులు ముందున్నాడని తెలుసుకుంటూనే తన ప్లాన్స్ వేసుకుంటుంటాడు. మరోవైపు సైకోపాత్ కూడా తన వ్యూహాలతో ముందుకు సాగుతుంటాడు. వీరిద్దరి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్‌ను ఫస్ట్ హాఫ్‌లో బాగా ఎస్టాబ్లిష్ చేశారు.
కథను తొందరగా రివీల్ చేయకుండా పాత్రలను పరిచయం చేస్తూ, మిస్టరీని కొనసాగిస్తూ, టెన్షన్‌ను క్రమంగా పెంచుతూ ఫస్ట్ హాఫ్‌ను ఆసక్తికరంగా నడిపించారు. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది.
సెకండ్ హాఫ్‌లో తగ్గిన ఆసక్తి
అయితే సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి సినిమా కొంత ఫ్లాట్‌గా అనిపిస్తుంది. అక్షయ్ కుమార్ పాత్ర ఇలా ఎందుకు చేస్తున్నాడనే విషయం ముందుగానే ఊహించడం పెద్ద కష్టం కాదు. సినిమా క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో కూడా సులభంగా అంచనా వేయగలిగేలా కథ సాగుతుంది.
సైకోపాత్ పాత్ర వెనుక ఉన్న కారణం కూడా చాలా సాధారణంగా అనిపిస్తుంది. గతంలో ఎన్నో సినిమాల్లో చూసినట్లుగా.. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బాధ్యులను చంపడం అనే పాయింట్‌నే ఇక్కడ కూడా ఉపయోగించారు.
అంధుడైన హీరో, సైకోపాత్ విలన్ అనే కాంబినేషన్ వల్ల ప్రజెంటేషన్ కొత్తగా అనిపించినా.. కథలోని ప్రధాన అంశాలు మాత్రం చాలా పరిచయమైనవిగానే ఉంటాయి. అందుకే కథపై మొదట్లో ఉన్న ఆసక్తి, మిస్టరీ రివీల్ అవుతున్న కొద్దీ తగ్గిపోతుంది.
ఎడిటింగ్, క్లైమాక్స్
సెకండ్ హాఫ్‌లో ఎడిటింగ్ కూడా సినిమాకు కొంత ఇబ్బందిగా మారింది. కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి సాగినట్లు అనిపిస్తాయి. కథను మరింత టైట్‌గా చెప్పే అవకాశం ఉన్నప్పటికీ, ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు.
సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు సినిమాను కుదించే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ను మరింత వేగంగా, టెన్షన్‌తో నడిపించి ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేది.
ఫస్ట్ హాఫ్‌లో బలమైన సెటప్ ఇచ్చిన సినిమాను క్లైమాక్స్‌లో చాలా సాధారణంగా ముగించడం కొంత నిరాశ కలిగిస్తుంది. ప్రేక్షకులు ఆశించే స్థాయిలో చివరి భాగాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది.
తుది తీర్పు
మొత్తంగా చూస్తే.. మంచి ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్‌తో ఈ సినిమా ఓ డీసెంట్ థ్రిల్లర్‌గా అనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ నటన సినిమాకు ప్రధాన బలం. ప్రియదర్శన్ దర్శకత్వంలో ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగినా.. సెకండ్ హాఫ్‌లో కథనం, ఎడిటింగ్, క్లైమాక్స్ కారణంగా సినిమా తన పూర్తి స్థాయి సామర్థ్యాన్ని అందుకోలేకపోయింది.
ఫైనల్‌గా: ఫస్ట్ హాఫ్ బాగుంది.. సెకండ్ హాఫ్ యావరేజ్. ఒకసారి చూడదగిన డీసెంట్ సినిమా.

