స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ దీర్ఘకాల ప్రేమకు ముగింపు పలుకుతూ గురువారం ఉదయ్‌పూర్ వేదికగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. వివాహం అనంతరం, మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణాలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది.
ఢిల్లీలో ప్రత్యేక ఆహ్వానం
రిసెప్షన్‌కు హాజరుకావాలంటూ ఈ నవజంట స్వయంగా దేశ రాజధానికి వెళ్లి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను కలుసుకుని ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో విజయ్–రష్మిక సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, ఆహ్వాన పత్రాన్ని అందజేస్తూ మర్యాదపూర్వకంగా నిలిచిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియాలో సందడి
ఈ భేటీకి సంబంధించిన చిత్రాలు బయటకు రావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినీ జంటగా ఎంతో క్రేజ్ సంపాదించిన వీరిద్దరి వివాహం, రిసెప్షన్ ఏర్పాట్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
అయితే వివాహానికి ముందు విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు శ్రీమతి మాధవి, శ్రీ గోవర్ధన్ రావు దేవరకొండలు వివాహ ఆహ్వాన పత్రాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపించిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానానికి స్పందించిన ప్రధాని మోదీ, కాబోయే వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక లేఖను పంపించారు. ఈ లేఖను ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు తరఫున పంపారు.లేఖలో ఫిబ్రవరి 26, 2026న జరగనున్న విజయ్–రష్మికల వివాహ వేడుకకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందకరమైన, పవిత్రమైన సందర్భంలో దేవరకొండ, మందన్న కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.”
అలాగే, “విజయ్–రష్మికల జీవితంలో ఇది ఒక కొత్త, అందమైన అధ్యాయానికి ఆరంభం. ‘సఖా సప్తపదా భవ’ స్ఫూర్తితో కలిసి ఏడడుగులు వేస్తోన్న ఈ జంట జీవితాంతం స్నేహితులుగా కలిసుండాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి కలలతో, వాటి నెరవేర్పుతో వారి జీవితం నిండిపోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నిజమైన భాగస్వాములుగా జీవిత ప్రయాణం సాగాలి” అని ఆశీర్వదించారు.