హైదరాబాద్ నగర పరిధిలోని బాచుపల్లి ప్రాంతంలో మంగళవారం రాత్రి సుమారు 10.45 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాచుపల్లి-మియాపూర్ ప్రధాన రహదారిపై వరుసగా ఉన్న పలు ఫర్నీచర్ మరియు గృహోపకరణాల దుకాణాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. అంచనాల ప్రకారం ఈ ఘటనలో సుమారు రూ.5 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
స్థానికంగా ఉన్నకేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి సాయినగర్ రోడ్డువరకు దాదాపు 25 ఫర్నీచర్ షాపులు వరుసగా ఉన్నాయి. ఒక్కో దుకాణంలో లక్షల రూపాయల విలువైన కలప సామగ్రి, సోఫాలు, పడకలు, ఇంటీరియర్ వస్తువులు నిల్వ ఉంచి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొదట ఒక దుకాణంలో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగి, క్షణాల్లోనే పక్కనే ఉన్న మరో 18 దుకాణాలకు వ్యాపించాయి.
ఫర్నీచర్‌తో పాటు సిలిండర్స్ కూడా మంటల్లో..
కొంతమంది వ్యాపారులు దుకాణాల వెనుకభాగంలోనే నివాసం ఉంటుండటంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఫర్నీచర్‌తో పాటు వంటగ్యాస్ సిలిండర్లు కూడా మంటల్లో చిక్కుకోవడంతో భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి. మంటల తీవ్రత కారణంగా సమీపంలోని కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ ముందుభాగానికీ అగ్ని వ్యాపించింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే వ్యాపారులు తమ జీవితకాల సంపాదన క్షణాల్లో బూడిదైపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈతకు వెళ్లి మునిగారు..
ఈ ఘటన హోలీ పండుగ సమయంలో చోటుచేసుకోవడం మరింత కలచివేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హోలీ సందర్భంగా నీటిలోకి దిగిన యువకులు మునిగిపోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సాగర్, అభిషేక్ అనే యువకులు పంతులు చెరువులో ఈతకు వెళ్లి మునిగిపోయారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు సమీపంలో గోదావరిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు సమాచారం.
హోలీ వేళ ఈ విధమైన అగ్ని, నీటి ప్రమాదాలు పునరావృతం కావడంతో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి, వంటగ్యాస్ సిలిండర్లను సురక్షితంగా ఉంచాలి, ఈతకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పోలీసులూ, అగ్నిమాపక శాఖ సూచనలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు.