- టీజీఐసీసీసీ ఆడిటోరియంలో సదస్సు నిర్వహణ
- సీపీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
- ఖైరతాబాద్ జోన్ నుండి 400 మంది సభ్యులు హాజరు
- ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ నిబంధన అమలుకు పిలుపు
- రహ్ వీర్ స్కీం గురించి అవగాహన కల్పన
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం బుధవారం టీజీఐసీసీసీ ఆడిటోరియంలో ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సు నిర్వహించింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని 10 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నుండి సుమారు 400 మంది రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ఇంటి యజమాని మరణిస్తే కుటుంబం మొత్తం వీధిన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి విషాదాలు జరగకుండా ప్రతి వాహనదారుడూ భద్రతా నిబంధనలను పవిత్రంగా పాటించాలని కోరారు.
Also Read : మావోయిస్టు రహితంగా తెలంగాణ: డీజీపీ ముందు 42 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ‘సోది కేశాలు’ సహా కీలక నేతలు జనజీవన స్రవంతిలోకి!
కాలనీలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక ట్రాఫిక్ సమస్యలను వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : హైదరాబాద్‌లో నకిలీ గుడ్‌నైట్ రీఫిల్స్ గుట్టురట్టు.. వేల సంఖ్యలో స్వాధీనం చేసుకున్న పోలీసులు
రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం ‘రహ్ వీర్’ స్కీం ద్వారా నగదు పురస్కారం, చట్టపరమైన రక్షణ కల్పిస్తోందని సజ్జనర్ వివరించారు. భయపడకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు.
ట్రాఫిక్ జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ మాట్లాడుతూ రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడపడం, డ్రైవింగ్‌లో మొబైల్ వాడటం ప్రాణాంతకమని హెచ్చరించారు. అనంతరం ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
Also read :హైదరాబాద్ ఐటీ భద్రతపై బండి సంజయ్ హెచ్చరిక.. డీజీపీ కౌంటర్!
కార్యక్రమం ముగింపులో సభ్యులందరితో రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్‌ను ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కమిటీ సభ్యుల పాత్ర కీలకమని అధికారులు అభిప్రాయపడ్డారు.


