- సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC)
- మాన్సూన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు
- శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో
వర్షాకాలానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో సిద్ధం
తెలంగాణలో వర్షాలు జోరందుకుంటున్న నేపథ్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) మాన్సూన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ 2026 కార్యక్రమాన్ని ప్రారంభించింది. నగర పరిధిలో తరచుగా నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక ఇంజినీరింగ్, శానిటేషన్ బృందాలను మోహరించింది.
శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో 24 గంటల పాటు పనిచేసే ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసిన వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించేలా ఏర్పాట్లు
సీఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు కింది అత్యవసర పరిస్థితుల్లో పనిచేయనున్నాయి.
- రహదారులపై నీటి నిల్వలు, వరద పరిస్థితులు
- డ్రైనేజీ ఓవర్‌ఫ్లో ఫిర్యాదులు
- చెట్లు, కొమ్మలు కూలిపోవడం
- వర్షాల కారణంగా తలెత్తే పారిశుధ్య సమస్యలు
- ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే అడ్డంకులు
వర్షాలు కురిసే సమయంలో ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు.
శేరిలింగంపల్లి జోన్‌లో ప్రత్యేక నిఘా
శేరిలింగంపల్లి జోన్‌లో నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, మస్జిద్‌బండ, బొటానికల్ గార్డెన్, బయోడైవర్సిటీ జంక్షన్ వంటి ప్రాంతాలను నీటి నిల్వలకు అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు.
నార్సింగి నుంచి పుప్పలగూడ వరకు, టి-గ్రిల్ జంక్షన్ నుంచి కోకాపేట్ రోటరీ వరకు, పటాన్‌చెరు-ఇస్నాపూర్ రహదారి, గచ్చిబౌలి జంక్షన్, డీఎల్ఎఫ్ రోడ్, ఐఐఐటీ జంక్షన్ ప్రాంతాల్లో ప్రత్యేక ఇంజినీరింగ్, శానిటేషన్ అధికారులు అందుబాటులో ఉంటారని సిఎంసీ వెల్లడించింది.
కూకట్‌పల్లి జోన్‌లో కీలక ప్రాంతాలపై ఫోకస్
కూకట్‌పల్లి జోన్‌లో మాదాపూర్, హఫీజ్‌పేట్, ఖాజాగూడ, సైబర్ టవర్స్, ఐకియా, జేఎన్‌టీయూ, కెపిహెచ్‌బీ, ఆల్విన్ కాలనీ, మూసాపేట్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు పనిచేయనున్నాయి.
సైబర్ టవర్స్ నుంచి ఐకియా వరకు, టాడీ కాంపౌండ్ నుంచి పార్వత్‌నగర్ వరకు, ఐ-ల్యాబ్ నుంచి సీఓడీ జంక్షన్ వరకు తరచుగా నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలుగా గుర్తించి అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
కుత్బుల్లాపూర్ జోన్‌లోనూ అప్రమత్తత
కుత్బుల్లాపూర్ జోన్‌లో జీడిమెట్ల, కొంపల్లి, దుండిగల్, నిజాంపేట్, మేడ్చల్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
సుచిత్ర నుంచి కొంపల్లి వరకు, గండిమైసమ్మ జంక్షన్, బాలానగర్-నర్సాపూర్ రహదారి, మల్లంపేట్-బాచుపల్లి, మేడ్చల్ చెక్‌పోస్ట్ వంటి ప్రాంతాల్లో అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు.
ప్రజలకు అధికారులు విజ్ఞప్తి
వర్షాల సమయంలో నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలు, చెట్లు కూలిపోవడం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత జోన్ అధికారులను సంప్రదించాలని సిఎంసీ సూచించింది.
ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని, ఇంజినీరింగ్, శానిటేషన్, ట్రాఫిక్ పోలీసులు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటామని అధికారులు తెలిపారు.
24 గంటలు సేవలందించే ఎమర్జెన్సీ వ్యవస్థ
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, ట్రాఫిక్ సమస్యలు వంటి పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఈసారి మాన్సూన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
వర్షాకాలం మొత్తం ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడనున్నాయి.
“మీ భద్రత.. మా ప్రాధాన్యత. ఈ మాన్సూన్‌లో అందరం అప్రమత్తంగా ఉండాలి” అని సిఎంసీ ప్రజలకు పిలుపునిచ్చింది.


