భారత్‌లోనే అతిపెద్ద గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ అయిన ముత్తూట్ ఫైనాన్స్, జూన్ 30, 2026తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1 FY27) అత్యంత బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం , రుణ ఆస్తులు (AUM) రెండింటిలోనూ వార్షిక ప్రాతిపదికన అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లోన్ ఏయూఎం 43 శాతం వృద్ధితో రూ. 1,91,532 కోట్లకు చేరగా, కన్సాలిడేటెడ్ నికర లాభం (PAT) కూడా 43 శాతం పెరిగి రూ. 2,825 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా కన్సాలిడేటెడ్ గోల్డ్ లోన్ ఏయూఎం 48 శాతం వృద్ధితో రూ. 1,75,527 కోట్లకు పెరిగింది. స్టాండలోన్ పరంగా లోన్ ఏయూఎం రూ. 1,72,053 కోట్లకు, నికర లాభం రూ. 2,550 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ క్యూ1లో కొత్తగా 4,82,707 మంది వినియోగదారులకు రూ. 8,937 కోట్ల గోల్డ్ లోన్లను పంపిణీ చేయడంతో పాటు, కొత్తగా 86 శాఖలను ప్రారంభించి నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది.
కీలక నాయకత్వ మార్పులు:
కంపెనీ బోర్డు డైరెక్టర్లు కీలకమైన నాయకత్వ మార్పులకు శ్రీకారం చుట్టారు. అలెగ్జాండర్ జార్జ్ ముత్తూట్‌ను ముత్తూట్ ఫైనాన్స్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా (MD) బోర్డు ప్రతిపాదించింది. ఈ నియామకం అక్టోబర్ 1, 2026 నుండి అమల్లోకి రానుంది. అలాగే ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి, తదుపరి తరం నాయకత్వానికి మార్గదర్శకత్వం వహించనున్నారు. మరోవైపు ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న కే.ఆర్. బిజిమాన్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా పదోన్నతి కల్పించాలని బోర్డు ప్రతిపాదించింది.
చైర్మన్ , ఎండీ మాట్లాడుతూ..
కంపెనీ పనితీరుపై చైర్మన్ జార్జ్ జాకోబ్ ముత్తూట్ మాట్లాడుతూ, కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనమని, పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎండీ డెసిగ్నేట్ అలెగ్జాండర్ జార్జ్ ముత్తూట్ మాట్లాడుతూ, సంస్థను పూర్తి స్థాయి ఆర్థిక సంస్థగా తీర్చిదిద్దడంతో పాటు, అత్యుత్తమ కార్పొరేట్ పాలన , కస్టమర్ సంతృప్తికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.