హైదరాబాద్ ట్రాఫిక్‌కు మరో పరిష్కారం.. ఐసీసీసీ నుంచి రేతిబౌలి వరకు భారీ ఫ్లైఓవర్ నిర్మించే ఆలోచ‌న‌

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ నుంచి రేతిబౌలి జంక్షన్ వరకు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద

Hyderabad ICCC to Rethibowli Flyover
Hyderabad ICCC to Rethibowli Flyover

హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో నగర మధ్యభాగాన్ని అనుసంధానించే మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తాజా ప్రతిపాదన ప్రకారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) నుంచి రేతిబౌలి జంక్షన్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే వరకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించేందుకు చర్యలు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ నగరంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించేలా రూపకల్పన చేయనున్నారు.

ట్రాఫిక్ స‌మ‌స్య‌లు స‌గం త‌గ్గే అవ‌కాశం..

ప్రణాళిక ప్రకారం ఐసీసీసీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఫ్లైఓవర్ ఫిల్మ్ నగర్, అపోలో ఆస్పత్రి, మల్కం చెరువు రోడ్డు మీదుగా కొనసాగుతుంది. అక్కడి నుంచి టోలిచౌకి, నానల్ నగర్ ప్రాంతాలను దాటి చివరకు రేతిబౌలి జంక్షన్ వద్ద ఉన్న పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేతో అనుసంధానించనున్నారు. దీనికి సంబంధించిన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.

ఈ ఫ్లైఓవర్ పూర్తయితే నగర పశ్చిమ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల నుంచి ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.

కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఏడు అండర్‌పాస్‌లు

ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఏడు అండర్‌పాస్‌లు, ఏడు స్టీల్ ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు ఐసీసీసీ–రేతిబౌలి ఫ్లైఓవర్ కూడా జతకట్టితే హైదరాబాద్ వెస్ట్ జోన్‌లో ట్రాఫిక్ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

మొత్తంగా చూస్తే నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ కొత్త ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థకు కీలక మలుపుగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: మూసీ నది పునరుద్ధరణ… హైదరాబాద్ భవిష్యత్‌కు భారీ ప్రాజెక్ట్

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »