హైద‌రాబాద్‌లో దారుణం .. బాలికకు మత్తు ఇచ్చి అత్యాచారం, ముగ్గురు రౌడీషీటర్లు పరారీలో

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికకు గంజాయి తాగించి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ముగ్గురు రౌడీషీటర్ల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

Hyderabad police investigation in Narsingi case and ganja seizure operation
Hyderabad police investigation in Narsingi case and ganja seizure operation

హైదరాబాద్ నగరంలోని నార్సింగ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికకు మత్తు పదార్థం తాగించి అనంతరం అత్యాచారం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మత్తులోకి వెళ్లిన తర్వాత దారుణం

పోలీసుల వివరాల ప్రకారం, బాలిక పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాతే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది. బాధితురాలు చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి వెళ్లినట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం నార్సింగిలో నానమ్మతో నివసిస్తున్నట్లు తెలిసింది.

ఈ ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసి, అనంతరం అత్యాచారంగా కేసును మారుస్తూ దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు నెక్నంపూర్ డివిజన్‌లోని పాషా కాలనీకి చెందినదిగా గుర్తించారు. ముగ్గురు రౌడీషీటర్లు ఈ కేసులో అనుమానితులుగా ఉన్నారు. వారు పరారీలో ఉండగా, ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

భారీగా గంజాయి పట్టివేత

ఇక మరోవైపు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇటీవల కొల్లూరు పోలీసులు, శేరిలింగ‌ప‌ల్లి స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇద్దరు మాదకద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.25.72 లక్షల విలువైన 101.711 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను విజయనగరం జిల్లాకు చెందిన బస్వ జగన్నాథం (37), ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాకు చెందిన పల్లపు లక్ష్మీనారాయణ (52)గా గుర్తించారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని చిత్రకొండకు చెందిన రాజు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

దర్యాప్తులో గంజాయికి బానిసైన నిర్మాణ కార్మికులను లక్ష్యంగా చేసుకొని నిందితులు సరఫరా చేస్తున్నట్లు తేలింది. సుమారు పది రోజుల క్రితం సరుకును ఒడిశా నుంచి తెచ్చి, లేబర్ క్యాంపుల సమీపంలోని తెల్లాపూర్ ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కచ్చితమైన సమాచారం ఆధారంగా పంపిణీకి ముందే నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు రాజు కోసం గాలింపు కొనసాగుతోంది.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని డయల్ 100, సైబరాబాద్ NDPS ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ లేదా అధికారిక వాట్సాప్ హెల్ప్‌లైన్ 9490617444కు అందించాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »