గ్రేటర్‌లో కరెంట్ కోతల కలకలం… పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌తో నగరవాసుల ఆందోళన

వేసవి ఆరంభం కాకముందే గ్రేటర్‌లో కరెంట్‌ కోతలు షురూ కావ‌డం న‌గ‌ర ప్ర‌జ‌ల‌ని ఇబ్బందుల‌కి గురి చేస్తుంది.. రోజుకు ఐదారుసార్లు కరెంట్‌ పోయి రావడం, వోల్టేజీ హెచ్చుతగ్గులతో గృహోపకరణాలు దగ్ధమవుతుండ‌డం ఇబ్బందుల‌కి గురి చేస్తుంది. విద్యార్థులు , వర్క్‌ఫ్రం హోమ్‌ ఉద్యోగులు అసహనానికి గురవుతున్నారు.

Frequent power cuts affecting residents in Greater Hyderabad

హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో అప్రకటిత విద్యుత్ కోతలు నగరవాసులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే రోజుకు నాలుగు ఐదు సార్లు కరెంట్ పోయి రావడం, వోల్టేజ్ హెచ్చుతగ్గులతో గృహోపకరణాలు దెబ్బతింటున్నాయన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. విద్యార్థులు, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులు ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది ఫిబ్రవరి 9న గ్రేటర్‌లో విద్యుత్ డిమాండ్ 2,896 మెగావాట్లు నమోదవగా, ఈ ఏడాది అదే రోజున అది 3,383 మెగావాట్లకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలో మొత్తం పది సర్కిళ్లు ఉండగా సుమారు 65 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 58 లక్షలు గృహ కనెక్షన్లు, దాదాపు 8 లక్షలు వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి.

గత సంవత్సరం ఫిబ్రవరిలో గరిష్ఠ డిమాండ్ 3,512 మెగావాట్లు కాగా, వినియోగం 72 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న గరిష్ఠ డిమాండ్ 3,509 మెగావాట్లు కాగా వినియోగం 67 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. జనవరి చివరి వారంలో రోజువారీ సగటు డిమాండ్ 57 మిలియన్ యూనిట్లు ఉండగా, కేవలం పదిరోజుల్లోనే దాదాపు 10 మిలియన్ యూనిట్లు పెరగడం గమనార్హం.

పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో పాటు రాత్రి వేళల్లో కూడా వేడి అధికమవుతోంది. ఈ ప్రభావంతో గృహ, వాణిజ్య వినియోగం భారీగా పెరిగి విద్యుత్ మీటర్లు వేగంగా తిరుగుతున్నాయి. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో ఫీడర్లపై లోడ్ పెరిగి తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. వేసవి ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన

నగరంలో కరెంట్ పోవడం సాధారణమైపోయిందని ప్రజలు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోతలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, నగరంలో మాత్రం “మెయింటెనెన్స్” పేరుతో అడపాదడపా సరఫరా నిలిపేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులు వైఫై అంతరాయం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ పోయిన ప్రతిసారి ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఆన్‌లైన్ మీటింగ్స్, కాల్స్‌లో సమస్యలు వస్తున్నాయని వారు చెబుతున్నారు.

మెయింటెనెన్స్ పేరుతో కోతలేనా?

సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ప్రతి సర్కిల్‌లో మరమ్మతులు చేపడుతున్నామని విద్యుత్ శాఖ చెబుతున్నప్పటికీ, ముందస్తుగా ప్రకటించిన సమయాలకంటే భిన్నంగా కోతలు విధించడంపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెట్ల కొమ్మలు తొలగించడం, లైన్ల మరమ్మతులు, ఫీడర్ పనుల పేరుతో ఏదో ఒక సమయంలో సరఫరా నిలిపేస్తున్నారని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత సరఫరా నిలిచిపోతే, మరికొన్ని చోట్ల తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు అంతరాయం ఉంటోందని ఫిర్యాదులు ఉన్నాయి. మొత్తంగా గ్రేటర్‌లో విద్యుత్ సరఫరా అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »