ఫేస్‌బుక్ పరిచయం.. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ప్రేమ పేరుతో మోసగించిన సైబర్ గ్యాంగ్

సోషల్ మీడియాలో అపరిచితులని న‌మ్మ‌డం ఎంత ప్రమాదకరమో మరోసారి బయటపడింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ మాటలు నమ్మి హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూ.2.36 కోట్లు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.

Telangana High Court New Building
Telangana High Court New Building

హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ మాటలు నమ్మి ఏకంగా రూ.2.36 కోట్లు కోల్పోయాడు. ఈ ఘటనపై బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ ను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.

ఫేస్‌బుక్ పరిచయం.. నమ్మకం పెంచిన మాయ మాటలు

బాధితుడు వీరభద్రరావుకు గత ఏడాది ఆగస్టులో ‘కోరా’ అనే పేరుతో ఓ మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. తాను సింగపూర్‌కు చెందినదని, ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నానని చెప్పి అతడిని నమ్మించింది.

కొద్ది రోజుల చాటింగ్‌లోనే అతనితో సన్నిహితంగా మారి, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ నమ్మకం పెంచుకుంది. ఆ తర్వాత పెట్టుబడుల పేరుతో తన అసలు ప్లాన్ అమలు చేసింది.

ట్రేడింగ్ పేరుతో భారీ మోసం

“ఫేస్‌బుక్ స్టోర్ ద్వారా నా ఫ్రెండ్స్ భారీ లాభాలు పొందుతున్నారు” అంటూ బాధితుడిని ఇన్వెస్ట్ చేయమని ప్రోత్సహించింది. తర్వాత ఒక ఏపీకే (APK) ఫైల్ పంపి, దానిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయించింది.అదే సమయంలో ‘బెల్లా’ అనే మరో మహిళను పరిచయం చేసి, ఆమె సూచనల ప్రకారం ట్రేడింగ్ చేయాలని చెప్పింది.

వారి మాటలు నమ్మిన బాధితుడు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 12 మధ్య పలు విడతలుగా క్రిప్టో వాలెట్ ద్వారా రూ.2.36 కోట్ల వరకు నగదు బదిలీ చేశాడు. యాప్‌లో లాభాలు వస్తున్నట్లు చూపించినా, డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం మాత్రం ఇవ్వలేదు.

అనుమానం.. చివరికి పోలీసుల ఆశ్రయం

డబ్బు తిరిగి రాకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చి, తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల హెచ్చరిక

  • ఈ ఘటనపై పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు:
  • సోషల్ మీడియాలో పరిచయమయ్యే అపరిచితులను నమ్మవద్దు
  • తెలియని లింకులు, APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయకండి
  • తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడులను నమ్మకండి
  • క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వచ్చే ఆఫర్లపై అప్రమత్తంగా ఉండండి
  • రాత్రికి రాత్రే డబ్బు రెట్టింపు అవుతుందనేది మోసగాళ్ల ఉచ్చే అని పోలీసులు స్పష్టం చేశారు.

టెక్నాలజీ అభివృద్ధి ఎంత పెరిగితే, సైబర్ నేరాల పద్ధతులు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక తప్పు నిర్ణయం కోట్ల నష్టానికి దారి తీస్తుందనే దానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.

Also Read: ULC లేఅవుట్లపై HYDRAA క్లారిటీ.. ఇళ్లకు, ప్లాట్లకు ఎలాంటి చర్యలు లేవు

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »