NEET రీ-ఎగ్జామ్ కోసం భారత్‌లో Telegramపై తాత్కాలిక నిషేధం.. NTA సంచలన నిర్ణయం

NEET (UG) 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో Telegram ద్వారా జరుగుతున్న మోసాలు, తప్పుడు ప్రశ్నాపత్రాల ప్రచారాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 22 వరకు Telegram యాక్సెస్‌ను పరిమితం చేయడంతో పాటు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై కూడా తాత్కాలిక ఆంక్షలు విధించింది.

Telegram Ban in India
Telegram Ban in India
  • నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY).
  • Telegramపై తాత్కాలిక యాక్సెస్ పరిమితి, మెసేజ్ ఎడిట్ ఫీచర్ నిలిపివేత.
  • జూన్ 21న NEET (UG) 2026 రీ-ఎగ్జామ్; Telegram యాక్సెస్ పరిమితి జూన్ 22 వరకు.

NEET (UG) 2026 రీ-ఎగ్జామినేషన్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉపయోగిస్తున్న Telegram ప్లాట్‌ఫామ్‌పై తాత్కాలిక యాక్సెస్ పరిమితులు విధిస్తూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక ప్రకటన విడుదల చేసింది.

NTA సిఫారసుల మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) రెండు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం జూన్ 22, 2026 వరకు Telegram సేవలను భారతదేశంలో పరిమిత కాలానికి నిలిపివేయనున్నారు. అలాగే ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే (Message Editing) ఫీచర్‌ను జూన్ 30 వరకు నిలిపివేయాలని ఆదేశించారు.

ఎందుకు Telegramపై ఆంక్షలు?

NTA ప్రకారం, NEET రీ-ఎగ్జామ్‌కు ముందు Telegramలో అనేక ఛానళ్లు, గ్రూపులు, బాట్లు “Paper Leaked NEET”, “Re-NEET 2026”, “Private Mafia”, “REE NEET MAFIAA” వంటి పేర్లతో విద్యార్థులను మోసం చేస్తున్నాయి.

వీటిలో కొందరు వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తూ ప్రశ్నాపత్రం అందిస్తామని హామీలు ఇచ్చినట్లు NTA వెల్లడించింది. అయితే పరీక్షా ప్రశ్నాపత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ అధికారిక భద్రతా వ్యవస్థ బయటకు రాదని స్పష్టం చేసింది.

“ప్రశ్నాపత్రం ముందుగానే అందిస్తామని చెప్పేవారంతా మోసగాళ్లే” అని NTA హెచ్చరించింది.

మెసేజ్ ఎడిట్ ఫీచర్ ఎందుకు నిలిపివేశారు?

Telegramలో ఇప్పటికే పంపిన సందేశాలను తర్వాత ఎడిట్ చేసే సౌకర్యాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని NTA తెలిపింది.

పరీక్ష పూర్తైన తర్వాత అసలు ప్రశ్నాపత్రాన్ని పాత మెసేజ్‌లో జోడించి, ఆ మెసేజ్ టైమ్‌స్టాంప్ మాత్రం అలాగే ఉంచడం ద్వారా “పరీక్షకు ముందే పేపర్ లీక్ అయింది” అనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.

ఈ విధంగా ఫేక్ సాక్ష్యాలను సృష్టించే అవకాశాన్ని అడ్డుకునేందుకే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు వివరించింది.

I4C, పోలీసులు ఇప్పటికే రంగంలోకి

NTA ప్రకటన ప్రకారం, కేంద్ర హోంశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఇప్పటికే Telegramలోని పలు ఛానళ్లు, గ్రూపులు, బాట్లను తొలగించింది.

బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులు కూడా ఈ మోసాలపై చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు Telegram ద్వారా మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు NTA వెల్లడించింది.

ఈ ముఠా సుమారు రూ.1.5 కోట్ల లావాదేవీలు నిర్వహించిందని, ఒకే నెలలో వెయ్యికి పైగా మొబైల్ నంబర్లను సంప్రదించినట్లు దర్యాప్తులో బయటపడినట్లు తెలిపింది.

Telegram Message Edit-telegram-ban
Telegram Message Edit-telegram-ban

సాధారణ వినియోగదారులకు అసౌకర్యం..

Telegramపై విధించిన ఆంక్షల వల్ల విద్య, ఉద్యోగం, వ్యక్తిగత అవసరాల కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న లక్షలాది మంది వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతాయని NTA అంగీకరించింది.

అయితే ఈ పరిమితి తాత్కాలికమేనని, జూన్ 22తో Telegram యాక్సెస్‌పై ఉన్న ఆంక్షలు ముగుస్తాయని స్పష్టం చేసింది. మెసేజ్ ఎడిట్ ఫీచర్‌పై మాత్రమే జూన్ 30 వరకు పరిమితులు కొనసాగుతాయని పేర్కొంది.

విద్యార్థులకు NTA సూచనలు

జూన్ 21న జరగనున్న NEET (UG) 2026 రీ-ఎగ్జామినేషన్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని NTA స్పష్టం చేసింది.

విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, అనధికార సమాచారం నమ్మవద్దని సూచించింది. పరీక్షకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం కేవలం NTA వెబ్‌సైట్, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని కోరింది.

ఎవరైనా ప్రశ్నాపత్రం పేరుతో డబ్బులు అడిగినా, మోసపూరిత సమాచారం పంపినా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని NTA విజ్ఞప్తి చేసింది.

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »