ఇక నుండి సిగ్నల్‌ జంప్‌ చేస్తే కఠిన చర్యలు… హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, ఓవర్‌ స్పీడ్‌ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి కేవలం 8 రోజుల్లోనే 21 వేలకుపైగా కేసులు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.

Hyderabad Traffic Police Special Drive Against Signal Jumping and Wrong Side Driving
Hyderabad Traffic Police Special Drive Against Signal Jumping and Wrong Side Driving

హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. “ఎవరూ చూడరులే” అనే నిర్లక్ష్యంతో సిగ్నల్‌ జంపింగ్‌, ఓవర్‌ స్పీడ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ చేస్తే ఇకపై తప్పించుకోవడం కష్టమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్‌ నియంత్రణను కట్టుదిట్టం చేయడం లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ కేసులు నగరంలో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించారు. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు కేవలం ఎనిమిది రోజుల్లోనే 21,713 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ విభాగం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. రాంగ్‌ సైడ్‌లో వాహనాలు నడపడం వల్ల ట్రాఫిక్‌ జామ్‌లు పెరగడమే కాకుండా, ఇతర ప్రయాణికులకు ప్రాణాపాయం ఏర్పడుతోందని అధికారులు హెచ్చరించారు.

ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచే కార్య‌క్ర‌మాలు

ట్రాఫిక్‌ నియమాలను పాటించే వాహనదారులకు కూడా ఈ తరహా ఉల్లంఘనలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. రోడ్లపై గందరగోళ పరిస్థితులు నెలకొని ప్రమాదాలకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, పబ్లిక్‌ ప్లేసుల్లో అవగాహన సదస్సులు నిర్వహించడమే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా కూడా సెన్సిటైజేషన్‌ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

ఇక మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపైనే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు. ఓవర్‌ స్పీడ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ వంటి ఉల్లంఘనలపై ఈ-చలాన్‌లు జారీ చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నెంబ‌ర్‌ని సంప్ర‌దించాలి..

ట్రాఫిక్‌ ఉల్లంఘనలను అరికట్టడంలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పోలీసులు తెలిపారు. రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ లేదా ఇతర ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తే ప్రజలు నేరుగా పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల అధికారిక సోషల్‌ మీడియా హ్యాండిల్స్ ఫేస్‌బుక్‌, ఎక్స్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9010203626, ఈ-చలాన్‌ సంబంధిత సమస్యల కోసం 8712661690 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రోడ్డు భద్రత అందరి చేతుల్లోనే ఉందని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తు చేశారు. నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని, నగర ట్రాఫిక్‌ సజావుగా సాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »