హైదరాబాద్: తెలంగాణను దేశానికే క్రీడా రాజధానిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంను ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలని అధికారులను మరియు నూతనంగా ఏర్పాటైన #TelanganaSportsHub బోర్డు సభ్యులను ఆదేశించారు. చైనాలో ఉన్న క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు హైదరాబాద్‌లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
హేమాహేమీలతో స్పోర్ట్స్ బోర్డు:
స్టేడియం అభివృద్ధిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు:
- చైర్మన్: డాక్టర్ సంజీవ్ గోయెంకా (Dr. Sanjiv Goenka)
- కో-చైర్మన్: ఉపాసన కొణిదెల (Upasana Konidela)
- సభ్యులు: కావ్య మారన్ (Kaviya Maran), సి. శశిధర్.
మాస్టర్ ప్లాన్ ముఖ్యాంశాలు:
నేరుగా హెలికాప్టర్‌లో: విమానాశ్రయం నుంచి క్రీడాకారులు నేరుగా స్టేడియంకు చేరుకునేలా స్టేడియం ప్రాంగణంలోనే హెలిప్యాడ్ సౌకర్యం కల్పించనున్నారు.
ఒలింపిక్ స్థాయి సదుపాయాలు: భవిష్యత్తులో హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించినా ఆశ్చర్యపోనక్కర్లేని రీతిలో మౌలిక వసతులు ఉండాలని సీఎం సూచించారు.
ఐటీ ఉద్యోగుల కోసం: గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న లక్షలాది మంది ఐటీ ఉద్యోగులను ఆకర్షించేందుకు స్టేడియం వద్ద భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు.
ఆర్థిక స్వాలంబన: స్టేడియం నిర్వహణకు భవిష్యత్తులో ఎలాంటి నిధుల ఇబ్బంది లేకుండా ఆదాయ మార్గాలపై ఆర్కిటెక్ట్‌లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
జూన్ 2న శంకుస్థాపన:
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అప్పటిలోగా పూర్తిస్థాయి కార్యాచరణ నివేదికను సమర్పించాలని బోర్డుకు సీఎం ఆదేశాలిచ్చారు. స్టేడియం అభివృద్ధి విషయంలో బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
“లాంగ్ టర్మ్ గోల్”తో తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. గచ్చిబౌలి స్పోర్ట్స్ హబ్ రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారనుంది.
Also Read: హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద షాపుల వేలం.. అతి తక్కువ ధరకే వ్యాపార అవకాశం!


