హైదరాబాద్‌ను వేధిస్తున్న ‘గట్-వెదర్ పారడాక్స్’.. విపరీతమైన వేసవి ఉష్ణోగ్రతలతో జీర్ణకోశ వ్యాధుల కలకలం

హైదరాబాద్‌లో ఎండలు ఆకస్మిక వర్షాల ప్రభావంతో జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లు 30 శాతం పెరిగాయి. డీహైడ్రేషన్ వల్ల తలెత్తే గ్యాస్ట్రిక్ సమస్యలు, బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌: నగరంలో ప్రస్తుతం నెలకొన్న అస్థిరమైన వాతావరణం నగరవాసుల ఆరోగ్యాన్ని ముఖ్యంగా జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తోంది. మధ్యాహ్నం 40 డిగ్రీల ఎండ, సాయంత్రం ఆకస్మిక వర్షాలతో కూడిన ఈ ‘గట్-వెదర్ పారడాక్స్’ కారణంగా గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్లు 30 శాతం పెరిగాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జీర్ణవ్యవస్థపై వాతావరణ దాడి
వాతావరణంలో వస్తున్న వేగవంతమైన మార్పులు శరీరంలోని గట్ మైక్రోబయోమ్‌ను అస్తవ్యస్తం చేస్తున్నాయి. వేడి వల్ల కలిగే డీహైడ్రేషన్ నేరుగా మలబద్ధకం యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తోంది. అదనంగా, గాలిలో పెరుగుతున్న తేమ హెచ్ పైలోరీ, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాల వృద్ధికి దోహదపడుతోంది. దీనివల్ల ఆహారం, నీరు త్వరగా కలుషితమై అక్యూట్ డయేరియల్ డిసీజెస్ (ADD) వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయి.

ఐటీ ఉద్యోగుల్లో కొత్త సమస్యలు
నగరంలోని ఐటీ కారిడార్‌లో పనిచేసే వారిలో ‘హీట్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్’ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సుదీర్ఘ పని వేళలు, సమయానికి భోజనం చేయకపోవడం, అధికంగా కెఫీన్ తీసుకోవడం వంటి అలవాట్లకు వేసవి డీహైడ్రేషన్ తోడవడంతో పైల్స్, అనల్ ఫిషర్స్ వంటి తీవ్ర ఇబ్బందులు పెరుగుతున్నాయి.

సొంత వైద్యం వద్దు
న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ ల్యాబ్స్ చీఫ్ డాక్టర్ అంకిత శ్రీవాస్తవ మాట్లాడుతూ.. “సాధారణ ఎసిడిటీగా అనిపించే లక్షణాలు అంతర్లీనంగా ఉన్న టైఫాయిడ్ లేదా పారాసిటిక్ ఇన్ఫెక్షన్ల వల్ల కావచ్చు. ప్రజలు మెడికల్ షాపుల నుంచి నేరుగా మందులు వాడటం (Self-Medication) వల్ల అసలు వ్యాధి ముదురుతోంది. సరైన చికిత్స కోసం సీబీసీ, సీఆర్‌పీ, స్టూల్ కల్చర్ వంటి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి” అని స్పష్టం చేశారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
హైడ్రేషన్: కేవలం నీరు మాత్రమే కాకుండా ఓఆర్‌ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్లతో శరీరాన్ని చల్లబరుచుకోవాలి.

ఆహార నియమం: బయట దొరికే పచ్చి సలాడ్లు, స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఎప్పుడూ వేడి ఆహారాన్నే తీసుకోవాలి.

నిల్వ పదార్థాలు: వేసవిలో ఆహారం త్వరగా పాడవుతుంది కాబట్టి పాత నిల్వలను వాడకూడదు.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »