Adulterated Ginger-Garlic Paste హైదరాబాద్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు…

Adulterated Ginger-Garlic Paste బోరబండ, టప్పాచబుత్రాలో అపరిశుభ్ర తయారీ బట్టబయలు… రూ.7 లక్షల సరుకు స్వాధీనం; నగరవ్యాప్తంగా సరఫరా చేస్తున్న నిందితులు అరెస్ట్

Adulterated Ginger-Garlic Paste
Adulterated Ginger-Garlic Paste
  • టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇద్దరు నిందితులు (మొహమ్మద్ అబ్దుల్లా, మొహమ్మద్ జఫర్ ఆలమ్)
  • కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ, విక్రయం
  • బోరబండ మధురా నగర్, టప్పాచబుత్రా మలైమెట్ ప్రాంతం

హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల ( Adulterated Ginger-Garlic Paste)ముఠా మరోసారి బయటపడింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస మెరుపు దాడులు నిర్వహించి, బోరబండ మరియు టప్పాచబుత్రా ప్రాంతాల్లో అక్రమంగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న రెండు కేంద్రాలను గుర్తించారు. ఈ దాడుల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, సుమారు రూ.7 లక్షల విలువైన కల్తీ సరుకును స్వాధీనం చేసుకున్నారు.

మొదట బోరబండలోని మధురా నగర్‌లో ‘A1 సహారా గోల్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్’ పేరుతో జరుగుతున్న అక్రమ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. రాఘవేందర్ నేతృత్వంలోని బృందం, GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దాడి చేసింది. ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న మొహమ్మద్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పేస్ట్ తయారు చేస్తున్నట్లు బయటపడింది.

దుమ్ము, ఈగలు ముసిరే ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ చేయడం, నాణ్యతలేని ముడిసరుకుతో పాటు అసిటిక్ యాసిడ్, అధిక ఉప్పు, వెల్లుల్లి పొట్టును కలిపి కల్తీ చేయడం గమనార్హం. ఈ ప్రమాదకర పేస్ట్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేసి, హోల్‌సేల్ కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ భారీగా లాభాలు గడిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడిలో రూ.4.5 లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. ఇందులో 4275 కిలోల వెల్లుల్లి ముడిసరుకు, 150 కిలోల వెల్లుల్లి పొట్టు, 55 కిలోల తయారైన పేస్ట్, 800 కిలోల ఉప్పు, ప్యాకింగ్ పౌచ్‌లు, యంత్రాలు, వెయింగ్ మెషీన్లు ఉన్నాయి.

ఇక టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలైమెట్ ప్రాంతంలో మరో కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. అక్కడ మొహమ్మద్ జఫర్ ఆలమ్ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌లో సిట్రిక్ యాసిడ్, అధిక ఉప్పు కలిపి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పేస్ట్‌ను బహిరంగంగా, దుమ్ము, ఈగలు చేరే పరిస్థితుల్లో నిల్వ ఉంచడం కూడా బయటపడింది.

ఈ కేంద్రం నుంచి రూ.2.5 లక్షల విలువైన కల్తీ పేస్ట్, యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉత్పత్తులు నగరంలోని పలు కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా అవుతున్నట్లు తేలింది. అంతేకాకుండా, FSSAI లైసెన్స్‌లో ఉన్న చిరునామా, వాస్తవ తయారీ స్థలం వేరుగా ఉండటం నియమావళి ఉల్లంఘనగా గుర్తించారు.

రోజువారీ వంటల్లో ఉపయోగించే అల్లం-వెల్లుల్లి పేస్ట్ వంటి సాధారణ పదార్థం కల్తీ కావడం ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదం. ఈ ఉత్పత్తులు నేరుగా వంటలో వినియోగించబడటం వల్ల వేలాది మంది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

నగరంలో కల్తీ ఆహార పదార్థాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, అధికారులు తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని భావిస్తున్నారు. వినియోగదారులు కూడా నాణ్యతను నిర్ధారించుకొని మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

Also Read : రిఫ్రిజిరేటర్‌లో పొరపాటున వీటిని పెడుతున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడవచ్చు జాగ్రత్త!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »