2 దేశవ్యాప్తంగా భారత్ బంద్ పిలుపు.. కార్మిక, రైతు సంఘాల సమ్మెతో ఈ సేవలపై ప్రభావం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక, రైతు సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. పలు రంగాల సేవలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు యూనియన్లు పేర్కొన్నాయి.

Nationwide Bharat Bandh Protest by Trade Unions and Farmers in India
Nationwide Bharat Bandh Protest by Trade Unions and Farmers in India

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు గురువారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. కొత్త లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లుతో పాటు ప్రతిపాదిత భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు సంఘాల నాయకులు తెలిపారు. సుమారు 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటుండగా, రైతు సంస్థలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.

వాటిపై ఎక్కువ ప్ర‌భావం..

సమ్మె కారణంగా దేశంలోని పలు జిల్లాల్లో సాధారణ జీవన విధానంపై ప్రభావం పడే అవకాశం ఉందని యూనియన్ నేతలు చెబుతున్నారు. పారిశ్రామిక, వాణిజ్య, బ్యాంకింగ్, రవాణా, వ్యవసాయ రంగాల్లో సేవలు అంతరాయం కలగొచ్చని అంచనా వేస్తున్నారు. ఆటోరిక్షా డ్రైవర్లు, బస్సు, కారు, లారీ డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ట్రేడ్ యూనియన్ల అంచనా ప్రకారం కనీసం 30 కోట్ల మంది ఉద్యోగులు ఈ సార్వత్రిక సమ్మెలో భాగస్వాములు కావొచ్చని పేర్కొన్నారు.

అయితే అత్యవసర సేవలు కొనసాగనున్నాయి. ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలు, మెడికల్ షాపులు, పాలు, పత్రికల సరఫరా, అగ్నిమాపక కేంద్రాలు, విమాన సర్వీసులు, ఏటీఎంలు సాధారణంగా పనిచేస్తాయని సంఘాలు స్పష్టం చేశాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులపై ప్రభుత్వంవైపు నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ రవాణా ఇబ్బందుల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూసివేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కొత్త లేబ‌ర్ కోడ్స్ ర‌ద్దు..

కార్మిక సంఘాలు ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇవి కార్మికుల హక్కులను బలహీనపరుస్తాయని, ఉద్యోగ భద్రతను తగ్గిస్తాయని, సామాజిక భద్రతపై ప్రభావం చూపుతాయని ఆరోపిస్తున్నాయి. రైతు సంఘాలు మరోవైపు భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ తగ్గింపులు రైతులకు నష్టదాయకమని వాదిస్తూ, వ్యవసాయ రంగాన్ని ఆ ఒప్పందం నుంచి తప్పించాలని కోరుతున్నాయి.

ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) బలోపేతం, ముసాయిదా విత్తన బిల్లు ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు రద్దు, గ్రామీణ ఉపాధి చట్టాల్లో మార్పులపై పునర్విమర్శ వంటి పలు డిమాండ్లతో ఈ సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా 600కు పైగా జిల్లాల్లో ఈ నిరసన ప్రభావం కనిపించే అవకాశముందని యూనియన్లు పేర్కొంటున్నాయి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »